Agniveers: నౌకాదళంలో అగ్నివీరులు.. చరిత్రలో తొలిసారి మహిళా నావికులు

అగ్నిపథ్‌ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను భారత నౌకాదళంలోకి తీసుకున్నారు. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారు

Published : 03 Dec 2022 16:50 IST

దిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్‌ కింద దాదాపు 3000 మంది అగ్నివీరులను నేవీలోకి తీసుకున్నాం. ఇందులో 341 మంది మహిళలు ఉన్నారు. తొలిసారిగా నేవీలో మహిళా నావికులను నియమించాం’’ అని తెలిపారు.

గత ఏడాది కాలంలో నౌకాదళం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టిందని అడ్మిరల్‌ కుమార్‌ అన్నారు. ఐఎన్ఎస్‌ విక్రాంత్‌ విధుల్లో చేరడం  చారిత్రక ఘట్టమని కొనియాడారు. ఇక హిందూ మహాసముద్రంలోకి చైనా గూఢచర్య నౌకల ప్రవేశం గురించి కూడా ఆయన స్పందించారు. చైనా మిలిటరీ, పరిశోధనా నౌకల కదలికలపై నిఘా పెట్టామని, ఆ పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ‘‘ఆత్మనిర్భర్‌ భారత్‌పై కేంద్ర ప్రభుత్వం మాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 2047 నాటికి భారత నౌకాదళం ఆత్మనిర్భరత సాధిస్తుందని మేం హామీ ఇస్తున్నాం’’ అని నేవీ చీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని