రెండు వాహక నౌకలు.. 35కుపైగా యుద్ధవిమానాలతో విన్యాసాలు.. సత్తాచాటిన నౌకాదళం!

భారత నౌకా దళం తన దీటైన సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించింది. రెండు యుద్ధవిమాన వాహక నౌకలతోపాటు జలంతర్గాములు, ఇతర యుద్ధనౌకల కార్యకలాపాలను ఏకకాలంలో సమన్వయం చేస్తూ.. ‘ట్విన్‌ క్యారియర్‌ సీబీజీ ఆపరేషన్స్‌’ను విజయవంతంగా నిర్వహించింది.

Updated : 10 Jun 2023 15:07 IST

దిల్లీ: భారత నౌకా దళం (Indian Navy) తన సత్తాను మరోసారి చాటుకుంది. రెండు యుద్ధవిమాన వాహక నౌకలతోపాటు జలంతర్గాములు, ఇతర యుద్ధనౌకల కార్యకలాపాలను ఏకకాలంలో సమన్వయం చేస్తూ.. ‘ట్విన్‌ క్యారియర్‌ సీబీజీ ఆపరేషన్స్‌ (Twin Carrier CBG Operations)’ను విజయవంతంగా నిర్వహించింది. అంటే.. రెండు వాహక నౌకలతోకూడిన యుద్ధ బృందంతో ఏకీకృత కార్యకలాపాలు నిర్వహించడం. అరేబియా సముద్రం (Arabian Sea)లో ఈ మేరకు విన్యాసాలు చేపట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలను భారత నౌకాదళం ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

‘భారత నౌకాదళం అరేబియా సముద్రంలో 35కుపైగా యుద్ధ విమానాలతో ‘ట్విన్ క్యారియర్ సీబీజీ ఆపరేషన్‌’లు చేపట్టింది. ఈ కార్యకలాపాలు దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో నౌకాదళ నిబద్ధతను చాటి చెబుతూనే.. సముద్ర జలాల్లో వైమానిక సేవల దీటైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. రెండు వాహక నౌకలు.. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లతోపాటు ఇతర యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఇందులో భాగమయ్యాయి. వీటి కార్యకలాపాల మధ్య ఏకీకరణ.. సముద్ర ఆధారిత వైమానిక శక్తికి, సముద్ర జలాల్లో భారత్‌ సామర్థ్యానికి బలమైన నిదర్శనం’ అని నౌకాదళం పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని