
అమెరికా - కెనడాసరిహద్దు విషాదంపై..భారత అధికారుల ఆరా
దిల్లీ, టొరాంటో: అమెరికా - కెనడా సరిహద్దులో మంచుతుపానులో చిక్కి హృదయ విదారక పరిస్థితుల్లో మృతిచెందిన గుజరాతీ కుటుంబం గురించి భారత అధికార యంత్రాంగం ఆరాలు తీస్తోంది. రెండు దేశాల నడుమ అనధికారికంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో - 35 డిగ్రీల అతిశీతల పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఇద్దరు పిల్లలతోపాటు నలుగురు సభ్యులున్న కుటుంబం దారుణ విషాదాంతానికి గురైన విషయం తెలిసిందే. గుజరాతీ కుటుంబం అని ప్రాథమికంగా గుర్తించినా, ఇతర వివరాల వెల్లడికి కెనడా అధికారవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత అధికారులు తెలిపారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు.. ఇదే బృందంలోని ఏడుగురు భారతీయులు చట్టబద్ధమైన ధ్రువపత్రాలు లేని కారణంగా అమెరికా అధికారుల అదుపులో ఉన్నారు.
వీరిని తరలించే ప్రయత్నం చేసిన వ్యాన్ డ్రైవరు స్టీవ్ శాండ్(47)ను సైతం మానవ అక్రమ రవాణా నేరం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే ఇటు టొరాంటో.. అటు చికాగో నుంచి భారత రాయబార కార్యాలయాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. సరిహద్దులో భారతీయ కుటుంబం మృతిచెందిన సంఘటనపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. ‘ఇది దిగ్భ్రాంతికరమైన విషాదం. సరిహద్దులో మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాతో కలిసి సంయుక్త ప్రయత్నాలు కొనసాగిస్తాం’ అని మీడియాకు తెలిపారు.