Chenab Rail Bridge: చీనాబ్‌ బ్రిడ్జ్‌పై రైలు పరుగులు.. ట్రయల్‌ రన్‌ వీడియో చూశారా..?

Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Updated : 20 Jun 2024 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge)పై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ (Train Trail Run)ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంగల్డన్‌ నుంచి రియాసీ వరకు రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. మధ్యలో చీనాబ్‌ నది (Chenab River)పై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈ బ్రిడ్జ్‌పై జూన్‌ 16న ఓ రైలు ఇంజిన్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. చీనాబ్‌ నదిపై కట్టిన ఈ రైల్వే వంతెన మీదుగా రాంబన్‌ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌ - శ్రీనగర్‌ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని