IRCTC: డార్క్‌వెబ్‌లో అమ్మకానికి 3 కోట్లమంది రైల్వే ప్రయాణికుల డేటా..!

మూడు కోట్లమంది రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు సమాచారం. అయితే, ఈ వార్తలను ఐఆర్‌సీటీసీ ఖండించింది. 

Published : 29 Dec 2022 01:19 IST

దిల్లీ: గత కొంతకాలంగా ప్రభుత్వరంగ సంస్థల్లోని డేటా లక్ష్యంగా సైబర్‌దాడులు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు నగదు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి  రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్‌చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్‌సీటీసీలో నమోదైన సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికుల పేర్లు, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, చిరునామా, వయసు, జెండర్‌, ట్రావెల్‌ హిస్టరీ వంటి వివరాలను హ్యాక్‌ చేసినట్లు సమాచారం. ఈ డేటాను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచారట. షాడో హ్యాకర్‌ అనే పేరుతో డిసెంబరు 27న ప్రయాణికుల వివరాలను హ్యాక్‌ చేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. 

ఐఆర్‌సీటీసీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ‘‘మా నుంచి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదు. డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచిన సమాచారం ఐఆర్‌సీటీసీ హిస్టరీ ఏపీఐతో సరిపోలడంలేదు. అనుమానాస్పద రీతిలో సంస్థ నుంచి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదు’’ అని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, యూజర్‌ డేటా లక్ష్యంగా ఐఆర్‌సీటీసీపై సైబర్‌దాడి జరిగే అవకాశం ఉందంటూ  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు, ఈ డేటా లీక్‌ అంశంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఐఆర్‌సీటీసీతోపాటు అనుబంధ సంస్థలపై సైబర్‌దాడి జరిగిందా? లేదా? అనేది సరిచూసుకోవడంతోపాటు.. డేటా భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సీటీసీకి సూచించినట్లు తెలిపింది. గతంలో కూడా రెండుసార్లు ఐఆర్‌సీటీసీలో నమోదైన సుమారు 9 కోట్లమంది  ప్రయాణికుల వివరాలను  హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచారు. తాజాగా మరోసారి డేటా లీక్ వార్తలు రావడంతో వాటిని ఐఆర్‌సీటీసీ కొట్టిపారేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని