Railways: ఏడాదిలో 3.6కోట్ల మంది టికెట్‌ లేని ప్రయాణం.. ₹2,200 కోట్ల జరిమానా

రైళ్లలో (Indian Railways) తప్పుడు టికెట్లు లేదా టికెట్‌ లేకుండా (Ticketless passengers) ప్రయాణించిన 3.6కోట్ల మందిని పట్టుకున్నట్లు భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది.

Published : 26 May 2023 22:02 IST

దిల్లీ: భారతీయ రైల్వేలో (Indian Railways) టికెట్‌ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2022-23లో తప్పుడు టికెట్లు లేదా టికెట్‌ లేకుండా (Ticketless passengers) ప్రయాణించిన దాదాపు 3.6కోట్ల మందిని పట్టుకున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. వీరినుంచి జరిమానాగా రూ.2200 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం (RTI) కింద అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

2019-20లో 1.10కోట్ల మంది టికెట్‌ లేని ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. 2021-22లో ఈ సంఖ్య 2.7కోట్లకు పెరగ్గా.. 2022-23లో 3.6కోట్లకు చేరింది. 2020-21లో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. ఆ ఏడాది 32.56 లక్షల మంది పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన వారినుంచి 2020-21లో రూ.152 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేయగా.. 2021-22లో మాత్రం రూ.1574కోట్లు మేర వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 2022-23లో ఈ జరిమానాల మొత్తం రూ.2260 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఈ ఏడాదిలో టికెట్‌ లేకుండా ప్రయాణించిన వారి సంఖ్య కొన్ని చిన్న దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం.

టికెట్‌ లేకుండా ప్రయాణించేవారి పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్‌ ఉన్నవారు కూడా ప్రయాణం చేయలేకపోతుండటం గమనార్హం. కేవలం 2022-23లోనే 2.7కోట్ల మందికిపైగా ప్రయాణికులు టికెట్‌ కొనుగోలు చేసినప్పటికీ ప్రయాణం చేయలేకపోయారట. ఇందుకు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండటమే కారణమని వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు రద్దీ రూట్లలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది కూడా ఈ సంఖ్య 1.65కోట్లు ఉండటం రైల్వే ప్రయాణికులకు అసంతృప్తి కలిగించే విషయం.

ఇదిలా ఉంటే, రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణికుడు పట్టుబడితే రూ.250 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ప్రయాణించాల్సిన దూరానికి అయ్యే టికెట్‌ మొత్తానికి ఇది అదనం. ఒకవేళ ఈ జరిమానా విధించేందుకు సదరు వ్యక్తి నిరాకరించినా/ జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేకున్నా ఆ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(RPF)కు అప్పగిస్తారు. రైల్వే యాక్టులోని సెక్షన్‌ 137 ప్రకారం కేసు నమోదు చేసి.. మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తారు. అక్కడ రూ.1000 జరిమానా పడుతుంది. అవి చెల్లించడానికి సదరు వ్యక్తి నిరాకరిస్తే మాత్రం ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని