Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి

ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident)లో మృతులను, బాధితులను గుర్తించేందుకు భారతీయ రైల్వే (Indian Railways) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక వెబ్‌సైట్‌లో వారి వివరాలను పొందుపరిచింది. 

Published : 06 Jun 2023 01:17 IST

కటక్‌: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident) ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మందిని ఇప్పటికీ ఎవరూ గుర్తించలేదు. దీంతో మృతదేహాలను భద్రపరచడం అధికారులకు, ఆస్పత్రి వర్గాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వంతో కలిసి, భారతీయ రైల్వే (Indian Railways) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మృతుల ఫొటోలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆ వెబ్‌సైట్‌ల ద్వారా తమ వారి ఆచూకీ గుర్తించవచ్చని భారతీయ రైల్వే ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దాంతోపాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ లింక్‌ను కూడా భారతీయ రైల్వేశాఖ షేర్‌ చేసింది. 

  • బహనాగ రైలు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫొటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 
  • ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి జాబితా కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
  • కటక్‌లోని ఎస్‌సీబీలో చికిత్స పొందుతున్న వారి ఫొటోల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. 

రైలు ప్రమాదంలో ఇంకా ఎవరి వివరాలైనా తెలియకపోతే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 139కు ఫోన్‌ చేయొచ్చని ఇండియన్‌ రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. దాంతోపాటు బీఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 18003450061/1929కు కూడా ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయన్నారు. రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు లేదా ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు వచ్చే వారి కోసం భువనేశ్వర్‌ మున్సిపల్‌శాఖ అధికారులు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌, వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బాధితుల బంధువులను ఆస్పత్రి లేదా మార్చురికీ తరలించున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని