Indian Railway: ఆర్పీఎఫ్‌లో 20 వేల ఉద్యోగాలు.. రైల్వేశాఖ క్లారిటీ

ఆర్‌పీఎఫ్‌లో (RPF) 20వేల పోలీస్‌ కానిస్టేబుళ్ల (Conistables) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైందంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేసింది.

Published : 02 Apr 2023 01:32 IST

దిల్లీ: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF)లో 20వేల కానిస్టేబుల్‌ (Constable) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే (Indian Railway) నోటిఫికేషన్‌ జారీ చేసిందంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఉద్యోగార్థులను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ రైల్వేశాఖలో 20 వేల రైల్వే కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైనట్లు సామాజిక మాధ్యమాల్లోనూ, వార్తా పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మవద్దు. రైల్వే శాఖ అలాంటి నోటిఫికేషన్‌ ఏదీ జారీ చేయలేదు. ఒక వేళ జారీ చేసినట్లయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతోపాటు..ప్రెస్‌నోట్‌ విడుదల చేస్తాం’’ అని రైల్వేశాఖ పేర్కొంది.

మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీ పోలీస్‌ ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ (EOW) రైల్వే జాబ్‌ స్కామ్‌ రాకెట్‌ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలను ఆశ చూపి ఓ ముఠా తమిళనాడులోని 28 మంది నుంచి రూ.2.68 కోట్లు వసూలు చేసింది. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను  కోయంబత్తూర్‌కు చెందిన వికాస్‌ రానా, దిల్లీకి  చెందిన గోవింద్‌ పూరిగా గుర్తించారు. నిందితులు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తారని, ఆ తర్వాత వారిని  ట్రైనింగ్‌ పేరుతో దిల్లీ రైల్వే స్టేషన్‌లో వివిధ ప్లాట్‌ఫాంలపై నిల్చోబెట్టి వచ్చి పోయే రైళ్లను లెక్కించమని చెబుతారని, ఇలా రెండు నెలలు గడిచే లోపల తమకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసి ఉడాయిస్తారని ఈవోడబ్ల్యూ వెల్లడించింది. మరోవైపు నోటిఫికేషన్‌ విడుదలైందని నిరుద్యోగులను నమ్మించి, వారి నుంచి డబ్బులు దండుకునేందుకే కొందరు  ఉద్యోగ ప్రకటనలు విడుదలైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు