Mehul Choksi: భారత్‌కు ఛోక్సీ అప్పగింత.. ఇప్పట్లో లేనట్లే 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కన్పించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమైన డొమినికా పోలీసులకు

Published : 04 Jun 2021 15:06 IST

తిరుగు పయనమైన భారత దర్యాప్తు బృందం

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కన్పించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆ కేసుల్లో తీర్పు వచ్చేంతవరకు ఛోక్సీని పంపించే అవకాశం లేదు. దీంతో ఆయనను తీసుకొచ్చేందుకు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థల బృందం స్వదేశానికి తిరుగు పయనమైంది. 

గత నెల 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన ఛోక్సీని ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికా దేశంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఛోక్సీని అక్రమంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన లీగల్‌ టీం చెబుతుండగా.. అక్రమంగానే ప్రవేశించారని పోలీసులు చెప్పారు.  ఛోక్సీ అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై తదుపరి విచారణను జూన్‌ 14న చేపడతానని వెల్లడించింది. ఇక ఛోక్సీ కోసం ఆయన న్యాయవాదుల బృందం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణను అక్కడి ఉన్నత న్యాయస్థానం జులైకి వాయిదా వేసింది.

ఛోక్సీ డొమినికాలో ఉన్నట్లు తేలగానే భారత్‌ నుంచి ఈడీ, సీబీఐ అధికారుల బృందం ఒకటి గత నెల 28న ఆ దేశానికి చేరుకుంది. అతడిని భారత్‌కు అప్పగించాలంటూ న్యాయస్థానంలో పత్రాలు సమర్పించిది. అయితే పై రెండు కేసుల్లో డొమినికా కోర్టు తీర్పు వెల్లడిస్తేనే ఆయన అప్పగింతకు మార్గం సుగమమవుతుంది. అది ఇప్పట్లో జరిగేలా లేకపోవడంతో భారత్‌ నుంచి వెళ్లిన దర్యాప్తు బృందం నిన్న రాత్రి తిరుగుపయనమైంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ బృందం దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్‌ మోదీ ప్రధాన నిందితులు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ భారత్‌ నుంచి పారిపోయాడు. అంతకుముందే ఆంటిగ్వా పౌరసత్వం ఉండటంతో అక్కడే తలదాచుకుంటున్నాడు. అయితే మే 23న ఛోక్సీ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. క్యూబా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఇటీవల జైలు గదిలో గాయాలతో ఉన్న ఛోక్సీ ఫొటోలు బయటకొచ్చాయి. కస్టడీలో ఆయనను తీవ్రంగా కొట్టారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఛోక్సీ పోలీసుల భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని