
Omicron: కొత్త వేరియంట్‌పై భారత టాప్ వైరాలజిస్ట్ ఏమన్నారంటే..
దిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇది తట్టుకునే వీలుందని పేర్కొన్నారు. భారత్‌లో టాప్ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ల్లో ఒకరైన గగన్ దీప్ ప్రస్తుతం వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం కొత్త వేరియంట్ గుర్తించిన దాని కంటే ఎక్కువ ప్రాంతాలకు ఇప్పటికే వ్యాపించి ఉంటుందని గగన్‌దీప్ తెలిపారు. మరో రెండు వారాల్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అప్పుడు ఈ వేరియంట్ పనితీరు పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు. ప్రయాణ ఆంక్షలు మాత్రమే వైరస్ కట్టడికి సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు. క్వారంటైన్, వైరస్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉన్నవారిని వెంటనే గుర్తించి చికిత్స అందించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గట్టి నిఘా ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు బూస్టర్ డోసు ఇవ్వాల్సిందేనని సూచించారు. అయితే, దీనికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలన్నారు.
మరోవైపు టీకాలు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు గట్టిగా విశ్వసిస్తున్నారు. కొత్త వేరియంట్ ‘విపత్తు’ ఏమీ కాదని బ్రిటన్ ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ కేలమ్ సెంపుల్ శనివారం చెప్పారు. ఐసీయూలో చేరాల్సి రావడం, మరణాల ముప్పు వంటివాటికి ఆస్కారం బాగా తక్కువేనన్నారు. టీకాలను ఏమారుస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. ఇదిలా ఉంటే.. కొవిడ్-19 టీకాలు కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ రకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.