Modi-Putin: రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి.. మోదీతో విందులో పుతిన్‌ నిర్ణయం

Modi-Putin: రష్యా తరఫున ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులకు త్వరలోనే విముక్తి లభించనుంది. పుతిన్‌తో భేటీ వేళ మాస్కో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 09 Jul 2024 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ (Ukraine)తో యుద్ధంలో వారంతా మాస్కో సైన్యానికి (Russian Army) సహాయకులుగా పని చేస్తున్నారు. అయితే, వారందరినీ వదిలిపెట్టేందుకు రష్యా తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాధినేతలు మోదీ (PM Modi), పుతిన్‌ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మాస్కో చేరుకున్నారు. ఆయన గౌరవార్థం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) నిన్న రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్‌ డిన్నర్‌లో యుద్ధంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని మన ప్రధాని (Narendra Modi).. పుతిన్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించిన రష్యా అధినేత.. వారిని విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల ఆశ చూపి భారత్‌ నుంచి కొంతమంది యువకులను మోసపూరితంగా రష్యా (Russia)కు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారని గతంలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వీరిలో కనీసం నలుగురు భారతీయులు యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి మాస్కో అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలోనే కొంతమంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకా 30-40 మంది భారత యువకులు (Indians in Russian Army) ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్నట్లు సమాచారం.

మాకు భారత్‌ వ్యూహాత్మక భాగస్వామి.. పుతిన్‌తో మోదీ భేటీపై అమెరికా

యుద్ధంపై మోదీ సూచన..

ఈ విందు సమావేశంలో ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ‘‘దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్‌ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవు. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలు’’ అని ఈ సందర్భంగా మోదీ పుతిన్‌కు సూచించినట్లు సమాచారం. 2022లో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్య ప్రారంభించిన తర్వాత మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో షాంఘై సదస్సు సమయంలో ఈ దేశాధినేతలు ముఖాముఖి భేటీ అవ్వగా.. ‘ఇది యుద్ధాల శకం కాదు’ అని ప్రధాని సూచించారు.

ఇక, భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీని రష్యా అధినేత ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఇది యాదృచ్చికంగా సాధించిన విజయం కాదు. ఎన్నోఏళ్లుగా మీరు చేసిన కృషికి, మీ శ్రమకు దక్కిన ఫలితం. మీకు మీ సొంత ఆలోచనలున్నాయి. మీరు ఎంతో శక్తిమంతమైన వ్యక్తి. భారత్, భారతీయుల ప్రయోజనాల కోసం లక్ష్యాలను సాధించగల దిట్ట’ అని పుతిన్‌ కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని