Antibiotics: భారత్‌లో యాంటీబయోటిక్స్‌ వినియోగం ఎక్కువే..

అజిత్రోమైసిన్‌.. కరోనా మహమ్మారి సమయంలో ఈ యాంటీబయోటిక్స్ మందు పేరు మార్మోగింది. మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే

Updated : 07 Sep 2022 14:02 IST

టాప్‌లో అజిత్రోమైసిన్‌.. లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజిత్రోమైసిన్‌.. కరోనా మహమ్మారి సమయంలో ఈ యాంటీబయోటిక్స్ మందు పేరు మార్మోగింది. మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే యాంటీబయోటిక్స్‌ ఇదే మరి..! కరోనా మహమ్మారి ముందు, తర్వాత కూడా భారత్‌లో యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే ఇందులో చాలా ఔషధాలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేనివేనని పేర్కొంది.

ఆగ్నేయాసియాలో ప్రాంతీయ ఆరోగ్యంపై లాన్సెట్‌ అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించింది. ఈ నివేదిక వివరాలను ఇటీవల బయటపెట్టింది. భారత్‌లో యాంటీబయోటిక్స్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని, దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది. దేశంలో మొత్తం యాంటీబయోటిక్స్‌ వినియోగంలో 75శాతం.. కేవలం 12 రకాల యాంటీబయోటిక్‌లే ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇందులో అజిత్రోమైసిన్‌ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత సెఫిక్జిమ్‌ రెండో స్థానంలో ఉంది.

భారత్‌లో మొత్తంగా వెయ్యికి పైగా యాంటీబయోటిక్‌ ఫార్ములేషన్లు ఉండగా.. 10,100 బ్రాండ్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఇందులో చాలా వరకు యాంటీబయోటిక్‌ బ్రాండ్లను కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విక్రయిస్తున్నట్లు తెలిపింది. యాంటీబయోటిక్స్‌ వినియోగాన్ని తగ్గించేందుకు తక్షణ విధాన, నియంత్రణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అవసరమున్నా లేకపోయినా ఎడాపెడా యాంటీబయోటిక్స్‌ను వినియోగించడం వల్ల రోగనిరోధక సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని