Press Freedom: ‘దురుద్దేశంతోనే ఆ కథనం..!’ కేంద్ర మంత్రి ఠాకూర్‌ మండిపాటు

భారత్‌తోపాటు ఇక్కడి ప్రజాస్వామ్య సంస్థలపై దుష్ప్రచారం చేయాలని కొన్ని విదేశీ వార్తాసంస్థలు యత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై ఓ అమెరికన్‌ వార్తాసంస్థ ప్రచురించిన కథనాన్ని ఆయన ఖండించారు.

Published : 11 Mar 2023 00:15 IST

దిల్లీ: భారత్‌లో పత్రికా స్వేచ్ఛ(Freedom Of Press) అంశంపై ఓ అమెరికన్‌ వార్తా సంస్థ(NYT) ప్రచురించిన కథనంపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) తీవ్రంగా మండిపడ్డారు. భారత్‌కు సంబంధించిన అంశాలను ప్రచురించే విషయంలో తటస్థతను పాటించడాన్ని ఆ వార్తాసంస్థ ఎప్పుడో వదిలేసిందని విమర్శించారు. సదరు విదేశీ పత్రిక కథనాన్ని.. దుర్మార్గం, కల్పితమైనదిగా విరుచుకుపడ్డారు. భారత్‌తోపాటు ఇక్కడి ప్రజాస్వామ్య సంస్థలు, విలువలపై దుష్ప్రచారం చేయాలన్న ఏకైక ఉద్దేశంతో దాన్ని ప్రచురించినట్లు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు.

భారత్‌లో ప్రాథమిక హక్కుల మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ కూడా ఎంతో పవిత్రమైనదని కేంద్ర మంత్రి ఠాకూర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కశ్మీర్‌(Kashmir)లో పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా విదేశీ మీడియా ప్రచారం చేస్తోన్న పచ్చి అబద్ధాలు ఖండించదగినవని స్పష్టం చేశారు. న్యూయార్క్‌ టైమ్స్‌తోపాటు కొన్ని ఇతర విదేశీ మీడియా సంస్థలు.. భారత్‌తోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేస్తోన్న అసత్య ప్రచారానికి తాజా కథనం కొనసాగింపు అని తెలిపారు. అయితే, ఇలాంటి అబద్ధాలు ఎక్కువ కాలం నిలవవని చెప్పారు.

‘భారత్‌తోపాటు ప్రధాని మోదీపై ద్వేషాన్ని పెంచుతోన్న కొన్ని విదేశీ మీడియా సంస్థలు.. చాలా కాలంగా మన ప్రజాస్వామ్యం, ఇక్కడి సమాజం గురించి అబద్ధాలు ప్రచారం చేయడానికి యత్నిస్తున్నాయి. అయితే.. దేశంలో ప్రజాస్వామ్యంతోపాటు ప్రజలంతా పరిణతి చెందినవారే. ఇటువంటి దురుద్దేశపూరిత సంస్థల నుంచి ప్రజాస్వామ్య పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఆలోచన ధోరణిని భారతీయులు ఎన్నటికీ అనుమతించరు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై అణచివేత మొదలైందంటూ వచ్చిన కథనంపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ మేరకు స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని