Covaxin: కొవాగ్జిన్‌తో డెల్టా ఆట కట్టు

కరోనా రకాల్లో అత్యంత ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్‌ ఆట కట్టించడంలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌ఐహెచ్‌) తెలిపింది

Updated : 30 Jun 2021 12:50 IST

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా రకాల్లో అత్యంత ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్‌ ఆట కట్టించడంలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా పనిచేస్తోందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌ఐహెచ్‌) తెలిపింది. ఈ టీకా తీసుకున్న వారి సీరమ్‌లపై రెండు అధ్యయనాలు జరపగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కొవాగ్జిన్‌ సమర్థంగా తటస్థీకరిస్తున్నట్లు తేలిందని ఎన్‌ఐహెచ్‌ పేర్కొంది.

‘‘భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సహకారంతో ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తోంది. ఈ టీకా తీసుకున్న వారి బ్లడ్‌ సీరమ్‌లను అధ్యయనం చేయగా.. కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసే యాంటీబాడీలు బి.1.1.7(ఆల్ఫా), బి.1.617(డెల్టా) రకాలను సమర్థంగా తటస్థీకరిస్తున్నట్లు తెలిసింది’’అని ఎన్‌ఐహెచ్‌ వెల్లడించింది. ఆల్ఫా వేరియంట్‌ మొట్టమొదట యూకేలో బయటపడగా.. డెల్టా రకాన్ని తొలిసారిగా భారత్‌లో గుర్తించారు.

ఇప్పటివరకు వెల్లడించిన కొవాగ్జిన్‌ రెండో దశ క్లినికల్‌ ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఈ టీకా భద్రమైందని, అన్ని రకాల వైరస్‌లపై పనిచేస్తుందని తేలినట్లు ఎన్‌ఐహెచ్‌ గుర్తుచేసింది. మూడో దశ ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించని ఫేజ్‌ 3 ఫలితాల ప్రకారం.. ఈ టీకా కరోనాపై 78శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. మరోవైపు చిన్నారులకు కూడా కొవాగ్జిన్‌ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పిల్లలపై ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని