Vaccination Certificate: భారత్‌ కొవిడ్‌ టీకా పత్రానికి మరో అయిదు దేశాల్లో గుర్తింపు

కొవిడ్ పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న క్రమంలో ఆయా దేశాలు దశలవారీగా ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు టీకాలు, ఆయా దేశాల టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపు ప్రక్రియనూ ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్‌...

Published : 02 Nov 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌తో అల్లకల్లోలమైన పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న క్రమంలో ఆయా దేశాలు దశలవారీగా ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు టీకాలు, ఆయా దేశాల టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపు ప్రక్రియనూ ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్‌ కొవిడ్‌ టీకా ధ్రువపత్రాన్ని అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా మరో అయిదు దేశాలు వచ్చి చేరాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్తోనియా, కిర్గిస్థాన్‌, స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా, మారిషస్‌, మంగోలియా ఇందులో ఉన్నట్లు పేర్కొంది. సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్‌ చేశారు. టీకా ధ్రువపత్రాల పరస్పర గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోందని ఆయన తెలిపారు.

‘ప్రధాని మోదీ సైతం చర్చలు’

భారత్‌ కొవిడ్‌ టీకా ధ్రువపత్రం గుర్తింపు విషయంలో మొదట్లో బ్రిటన్‌తో చిక్కులు ఏర్పడిన విషయం తెలిసిందే. క్వారంటైన్‌ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం దీటుగా స్పందించడంతో ఆ దేశం దిగొచ్చింది. అక్టోబర్‌ ప్రారంభంలో హంగేరీ, సెర్బియా తదితర దేశాలూ భారత్‌ టీకా పత్రాన్ని గుర్తించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల తన ఇటలీ పర్యటనలో భాగంగా టీకా ధ్రువపత్రాల పరస్పర గుర్తింపు అంశంపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు విదేశాంగ కార్యదర్శి హర్ష్ వీ శ్రింగ్లా పేర్కొన్నారు. మరోవైపు భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకానూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆస్ట్రేలియా థెరప్యూటిక్‌ గూడ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌(టీజీఏ) సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని