Afghanistan: అఫ్గాన్‌లో భారత్‌ ఆపరేషన్‌ ‘దేవీ శక్తి’.. 

తాలిబన్ల ఆక్రమణలతో కల్లోలంగా మారిన అఫ్గానిస్థాన్‌ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయులతో పాటు కొంతమంది అఫ్గాన్‌ వాసులను

Published : 25 Aug 2021 01:27 IST

దిల్లీ: తాలిబన్ల ఆక్రమణలతో కల్లోలంగా మారిన అఫ్గానిస్థాన్‌ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయులతో పాటు కొంతమంది అఫ్గాన్‌ వాసులను కూడా సురక్షితంగా మన దేశానికి తీసుకొస్తున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సాగుతోన్న ఈ ప్రక్రియకు ‘ఆపరేషన్‌ దేవీశక్తి’ అని పేరు పెట్టారు. 

ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఆపరేషన్‌ దేవీశక్తి కొనసాగుతోందన్న ఆయన.. ఇందుకోసం శ్రమిస్తోన్న భారత వాయుసేన, ఎయిరిండియా, విదేశాంగశాఖ అధికారుల సేవలను కొనియాడారు. 

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన ఎరిగిన అఫ్గాన్‌ వాసులు దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి పోటెత్తారు. పరిస్థితులు క్షణక్షణానికి దిగజారడంతో భారత్‌ సహా ప్రపంచ దేశాలు అఫ్గాన్‌లో ఉన్న తమ పౌరులను వెనక్కి తరలించడం మొదలుపెట్టాయి. అలా ఆగస్టు 16న భారత్ కాబుల్‌ నుంచి 40 మందిని దిల్లీకి తీసుకొచ్చింది.

అయితే ఆ తర్వాత కాబుల్‌ గగనతలాన్ని మూసివేశారు. దీంతో అమెరికా, నాటో సహకారం తీసుకున్న భారత్‌.. తరలింపు ప్రక్రియ కొనసాగిస్తోంది.  అయితే భారతీయులతో పాటు అఫ్గాన్‌లో ఉన్న సిక్కులు, హిందువులను కూడా మానవతా దృక్పథంతో దేశానికి తీసుకొస్తున్నారు. వారికి ఆశ్రయం ఇవ్వాలని ఇటీవల ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మరో 78 మందిని తీసుకొచ్చారు. ఇందులో 25 మంది భారత పౌరులు కాగా.. మిగతా వారు అఫ్గాన్‌ సిక్కులు, హిందువులు అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 800 మందికి పైగా పౌరులను భారత్‌.. కాబుల్‌ నుంచి తరలించింది. అఫ్గాన్‌ నుంచి భారత్‌కు ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిలో ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉండటం గమనార్హం. 

భారత్‌కు చేరుకున్న గురు గ్రంథ్‌ సాహిబ్‌..

కాబుల్‌ నుంచి నేడు భారత్‌ చేరుకున్న వాయుసేన విమానంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్‌ సాహిబ్‌’ మూడు ప్రతులను కూడా తీసుకొచ్చారు. ఈ విమానం దిల్లీ చేరుకోగానే కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పూరి, వి. మురళీధన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రతులను అందుకున్నారు. స్వయంగా కేంద్రమంత్రి హర్‌దీప్‌ వాటిని తలపై ఉంచుకుని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి వాటిని న్యూ మహవీర్‌నగర్‌లోని గురు అర్జున్‌దేవ్‌జీ గురుద్వారాకు తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని