JaiShankar: వాళ్లు అంతకంటే గొప్పగా ఆలోచించలేరు..

ప్రధాని నరేంద్ర మోదీపై పాక్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. పాకిస్థాన్‌ ఉన్నతంగా వ్యవహరిస్తుందని తాము ఎన్నడూ అనుకోలేదంటూ విమర్శించారు.

Updated : 19 Dec 2022 19:25 IST

దిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై పాకిస్థాన్‌ మంత్రి బిలావల్‌ భుట్టో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మోదీపై అనాగరికంగా వ్యక్తిగత దాడికి దిగిన తీరును భారత్‌ ఇప్పటికే ఎండగట్టింది. మరోవైపు పాకిస్థాన్‌ (Pakistan) వైఖరిని నిరసిస్తూ భాజపా శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఈ వ్యవహారంపై భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (Jaishankar) తొలిసారి స్పందించారు. పాకిస్థానీలు ఉన్నతంగా ఆలోచిస్తారని భారత్‌ ఎన్నడూ అనుకోలేదని అన్నారు.

‘పాకిస్థాన్‌ (Pakistan) విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పాం. పాకిస్థాన్‌ హుందాగా వ్యవహరిస్తుందని భారత్‌ ఎన్నడూ అనుకోలేదు. వారిపై మా అంచనాలు ఎప్పుడూ ఉన్నతంగా లేవు’ అని ఓ జాతీయ వార్తా ఛానెల్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ (Jaishankar) చెప్పారు. అంతకుముందు నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో చేసిన వ్యాఖ్యలు అనాగరికమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

ఉగ్రవాదులను ఏరిపారేయలేని అసమర్థత ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల్లో కనిపిస్తోందంటూ పాకిస్థాన్‌పై భారత్‌ మండిపడింది. ఇటువంటి తరుణంలో పాకిస్థాన్‌ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని పేర్కొంటూ భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఇటీవల అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని