Anji Khad Bridge: దేశంలో తొలి తీగల రైల్వే వంతెన సిద్ధం.. కేబుళ్ల పొడవు ఎంతో తెలుసా!

భారత్‌లో తొలి కేబుల్‌ రైల్వే వంతెన సిద్ధమైంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూలోని రైసీ జిల్లాలో అంజీ ఖడ్‌ నదిపై దీన్ని నిర్మించారు.

Updated : 29 Apr 2023 16:19 IST

శ్రీనగర్: భారత రైల్వేశాఖ (Indian Railway) మరో ఘనత సాధించేందుకు చేరువైంది. జమ్మూలోని (Jammu) రైసీ జిల్లాలో చేపట్టిన దేశ మొట్టమొదటి తీగల రైల్వే వంతెన (Anji Khad Bridge) నిర్మాణం సిద్ధమైంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఈ విషయాన్ని వెల్లడించారు. 11 నెలల వ్యవధిలో ఈ కేబుల్‌ రైల్వే బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తిచేసినట్లు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు.

వంతెనను మొత్తంగా 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు రైల్వే మంత్రి చెప్పారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని వెల్లడించారు. తీగల అమరిక పనులకు సంబంధించిన వీడియోనూ ఈ సందర్భంగా పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. ‘ఎక్స్‌లెంట్‌’ అని ప్రశంసించారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు.

అంజీ ఖడ్‌ తీగల రైల్వే వంతెన.. జమ్మూ- బారాముల్లా మార్గంలోని కాట్రా- రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల మధ్య అంజీ ఖడ్‌ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను తొలుత చీనాబ్‌ నదిపై నిర్మించిన ఆర్చ్‌ బ్రిడ్జి తరహాలో నిర్మించాలనుకున్నారు. కానీ, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చివరికి తీగల వంతెనను ఖరారు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని