Indian Navy: నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’.. విశేషాలివే!

ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో అధునాతన సాంకేతికత కలిగిన యుద్ధ నౌకల్లో ఇది ఒకటని పేర్కొన్నారు.

Published : 18 Dec 2022 15:56 IST

ముంబయి: భారత నౌకాదళ(Indian Navy) శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. దేశీయంగా తయారు చేసిన స్టెల్త్‌ గైడెడ్‌ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌(INS Mormugao)’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) ఆదివారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌక(Warship)ల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధనౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలనూ తీర్చగలవు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో.. ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసిపెడతాం’ అని మంత్రి అన్నారు.

యుద్ధనౌక విశేషాలివే..

* ఈ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు కాగా, వెడల్పు 17 మీటర్లు. బరువు 7400 టన్నులు. గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్‌ పేరిట నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు.

భారత నౌకాదళం ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ దేశీయంగా రూపొందించిన నాలుగు 'విశాఖపట్నం' క్లాస్ డెస్ట్రాయర్‌లలో ఇది రెండోది. ఈ యుద్ధనౌకను మజగావ్‌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది.

నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్‌లతో నడిచే ఈ యుద్ధనౌక గంటకు 30 నాట్‌లకు పైగా వేగాన్ని అందుకోగలదు.

ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌లో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్‌తోపాటు ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు ప్రయోగించవచ్చు.

పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొంది 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గత ఏడాది డిసెంబర్ 19న ఈ యుద్ధనౌక మొదటిసారి జలప్రవేశం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని