Pathankot air base attack: అలీ కసిఫ్‌ జాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం!

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి కేసులో నిందితుడు, పాకిస్థాన్‌ జాతీయుడైన అలీ కసిఫ్‌ జాన్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.....

Published : 12 Apr 2022 20:09 IST

దిల్లీ: పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి కేసులో నిందితుడు, పాకిస్థాన్‌ జాతీయుడైన అలీ కసిఫ్‌ జాన్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. గత ఐదు రోజుల వ్యవధిలో కేంద్రం ముగ్గురిని ఉగ్రవాదులుగా ప్రకటించగా.. వీరిలో జాన్‌ అలియాస్‌ జాన్‌ అలీ కసిఫ్‌ మూడో టెర్రరిస్టు కావడం గమనార్హం. ఎన్‌ఐఏ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పలు కేసుల్లో జాన్‌ నిందితుడిగా ఉన్నాడు. పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ శిబిరాల నుంచి భారత్‌లో దాడులకు జాన్‌ ప్రణాళికలు వేసి.. వాటిని సమన్వయం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఉగ్రశిక్షణ కోసం క్యాడర్‌ నియామకంలోనూ పాల్గొంటున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

2016 జనవరిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు అమరులైన ఘటన దేశంలో విషాదం నింపింది. మరోవైపు, పుల్వామా దాడిలో నిందితుడు, పాకిస్థాన్‌ జాతీయుడైన మొహియుద్దీన్‌ ఔరంగజేబ్‌ ఆలంగీర్‌ను కేంద్ర ప్రభుత్వం నిన్న ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని