ImranKhan: పాకిస్థాన్‌లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం: భారత్‌

పాకిస్థాన్‌లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని,  అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్‌ తెలిపింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు.

Published : 04 Nov 2022 01:16 IST

దిల్లీ: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై దుండగుడు కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో భారత్‌ స్పందించింది. పాకిస్థాన్‌లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని,  అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ‘‘ఇప్పుడే ఓ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఓ కన్నేసి ఉంచాం. అంతేకాకుండా అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం.’’ అని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పుల ఘటనను ఉద్దేశిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు.

దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలంటూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ లాంగ్‌మార్చ్‌ పేరిట ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. లాంగ్‌ మార్చ్‌  వజీరాబాద్‌లో అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ఇమ్రాన్‌ఖాన్‌ కంటెయినర్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్‌ కంటెయినర్‌ పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలైనట్టు పీటీఐ నేత ఫవాద్‌ చౌధురి వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కంటెయినర్‌ నుంచి ఇమ్రాన్‌ను కారులోకి తరలిస్తుండగా ఆయన కుడి కాలికి బ్యాండేజీ ఉన్న దృశ్యాలు స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. పీటీఐకి చెందిన దాదాపు నలుగురు నాయకులు ఈ కాల్పుల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసిన వీడియోను పీటీఐ పార్టీ షేర్‌ చేసింది. అలాగే, ఈ ఘటనను ఇమ్రాన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని