Mrs world: 21ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్‌ వరల్డ్‌ కిరీటం

అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన మిసెస్‌ వరల్డ్‌ పోటీల్లో సర్గమ్‌ కౌశల్‌ విజేతగా నిలిచారు. 21ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్‌ వరల్డ్‌ కిరీటం దక్కడం విశేషం.

Published : 19 Dec 2022 01:19 IST

దిల్లీ: విశ్వవేదికపై భారత్‌(India)కు మరోసారి ప్రఖ్యాత అందాల కిరీటం దక్కింది. 63 దేశాల మహిళలు పాల్గొన్న మిసెస్‌ వరల్డ్‌ (Mrs World) అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌(Sargam Koushal)  విజేతగా నిలిచారు.  దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్‌కు దక్కడం విశేషం. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ  పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్‌కు 2021లో మిసెస్‌ వరల్డ్‌ విజేత షాయలిన్‌ ఫోర్డ్‌(అమెరికా) ఈ కిరీటాన్ని అందజేసింది. మిసెస్‌ పాలినేషియా  తొలి రన్నరప్‌గా.. మిసెస్‌ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు. సర్గమ్‌ విజేతగా నిలిచినట్టు మిసెస్‌ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఆదివారం అధికారికంగా తన ఇన్‌స్టాఖాతాలో పోస్టు చేసింది.  ఈ సందర్భంగా సర్గమ్‌ కౌశల్‌ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘దాదాపు 21-22 ఏళ్ల తర్వాత మనకు మళ్లీ కిరీటం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ ఇండియా, లవ్‌ యూ వరల్డ్‌’’ అని పేర్కొన్నారు.

వివాహిత మహిళల కోసం ఈ అందాల పోటీలు1984 నుంచి నిర్వహిస్తున్నారు. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్‌ అదితీ గోవిత్రికర్‌ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక మిసెస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్న మహిళగా సర్గమ్‌ రికార్డు సృష్టించారు. సర్గమ్‌ తన ఇన్‌స్టాఖాతాలో పేర్కొన్న వివరాలను బట్టి.. ఆమె ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తిచేసి విశాఖపట్నంలో కొంతకాలం టీచర్‌గానూ పనిచేశారు. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఆమె భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఈ కిరీటం సాధించిన సర్గమ్‌ కౌశల్‌ను అదితీ గోవిత్రికర్‌ అభినందించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు