Coronavirus: జనవరి 23 నాటికి కరోనా విజృంభణ.. ఎన్ని కేసులు వస్తాయంటే?

కరోనా థర్డ్‌ వేవ్‌లో.. ఈనెల 23న కేసులు పీక్​ స్టేజ్​కు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలలోపే ఉంటుందని.......

Published : 19 Jan 2022 17:09 IST

అంచనా వేసిన ‘సూత్ర కొవిడ్ మోడల్’ పరిశోధకుడు

దిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తోడవడంతో దేశంలో థర్డ్‌వేవ్‌ మొదలై రోజూ రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ థర్డ్‌ వేవ్‌లో.. ఈనెల 23న కేసులు రికార్డు స్థాయికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలలోపే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్, ‘సూత్ర కొవిడ్ మోడల్’ పరిశోధకుల్లో ఒకరైన మణీంద్ర అగర్వాల్ ఈ విషయం వెల్లడించారు. మహమ్మారి మొదలైనప్పటి నుంచి దేశంలో వైరస్‌ వ్యాప్తి క్రమాన్ని అంచనా వేసేందుకు సూత్ర కొవిడ్‌ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు.

దిల్లీ, ముంబయి, కోల్​కతా నగరాలు గత వారంలోనే కరోనా థర్డ్​ వేవ్​ పీక్​ స్టేజ్​ను చూశాయని మణీంద్ర అగర్వాల్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, గుజరాత్​, హరియాణాలో ఈ వారం కొవిడ్‌ మూడో దశ గరిష్ఠస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, అసోం, తమిళనాడులో వచ్చే వారం అత్యధిక సంఖ్యలో రోజువారీ కేసులు నమోదై, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని తెలిపారు.

ఈ జనవరి నెలాఖరుకు కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్​కు చేరుకుంటుందని మణీంద్ర ఇటీవల అంచనా వేశారు. రోజువారీ కేసుల సంఖ్య గరిష్ఠంగా 7.2లక్షలు ఉండొచ్చని తొలుత భావించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారినట్లు తెలిపారు. ‘మా అంచనాలన్నీ చాలా వేగంగా మారుతున్నాయి. టెస్టింగ్​కు సంబంధించి ఐసీఎంఆర్​ మార్గదర్శకాలు మార్చడమే ఇందుకు కారణం. అయితే.. ఇప్పటికీ దేశంలోని కొన్ని చోట్ల కొత్త మార్గదర్శకాలు అమలు కాలేదు. ఆయా చోట్ల మా అంచనాలు అలాగే ఉన్నాయి. జనవరి 11 వరకు ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే ఈనెల 23న అత్యధికంగా 7.2లక్షల కేసులు నమోదు కావచ్చొని అనుకున్నాం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల మధ్య ఆ సంఖ్య 4 లక్షల లోపే ఉండొచ్చు’ అని ఫణీంద్ర వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని