
త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ: అమిత్‌షా
దేశం చుట్టూ కంచెలు నిర్మిస్తామన్న హోం మంత్రి
దిల్లీ: జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీవో)తోపాటు కొన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు సరిహద్దులను మరింత పటిష్ఠం చేసేందుకు 2022 నాటికి ఖాళీలు ఉన్న చోట కంచెలు నిర్మిస్తామన్నారు.
జమ్ములోని భారత వైమానిక స్థావరంపై జూన్ 27 జరిగిన డ్రోన్ దాడి ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. భవిష్యత్ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీలైనంత తొందరగా యాంటీడ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ‘‘ డ్రగ్స్, మారణాయుధాలు, ప్రేలుడు పదార్థాలను సొరంగాలు, డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేయడం ఇటీవల ఎక్కువైపోయింది. వీటిని గుర్తించడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించాలి. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్ టెక్నాలజీని దేశ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తామన్న నమ్మకం నాకుంది’’ అని బీఎస్‌ఎఫ్ సిబ్బందితో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా అన్నారు.
అత్యంత పటిష్ఠ భద్రతావలయంలో ఉండే వాయుసేన వైమానిక స్థావరంపై గత నెల 27న రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడిచాయి. తొలి పేలుడుతో వైమానిక స్థావరంలోని ఓ భవనం పైకప్పుకు రంధ్రం ఏర్పడింది. రెండో బాంబు ఖాళీ ప్రదేశంలో పడింది. ఇద్దరు వాయుసేన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ డ్రోన్లు పాక్ నుంచే వచ్చాయని భారత్ వాదిస్తోంది. కానీ, దాయాది దేశం కొట్టిపారేస్తోంది. సరిహద్దుల్లో డ్రోన్లు ఉపయోగించడం ఆ దేశానికి కొత్త కాదు. గతంలోనూ చాలా సార్లు ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు ఉగ్రమూకలకు సరఫరా చేసేందుకు వీటిని ఉపయోగిస్తూ వచ్చింది. చాలా సార్లు పాక్ డ్రోన్లను భారత బలగాలు నేలకూల్చాయి కూడా.