Indigo: దివ్యాంగ చిన్నారిని విమానంలోకి నిరాకరించిన ఇండిగో.. కేంద్రమంత్రి ఫైర్‌

దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో (indigo) సంస్థ విమానంలోకి రానివ్వని ఘటన రాంచీలో చోటుచేసుకుంది. చిన్నారి బాగా భయపడుతుండటంతో అతని ప్రయాణానికి నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది

Updated : 09 May 2022 14:26 IST

దిల్లీ: దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో (indiGo) సంస్థ విమానంలోకి రానివ్వని ఘటన రాంచీలో చోటుచేసుకుంది. చిన్నారి బాగా భయపడుతుండటంతో అతని ప్రయాణానికి నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే.. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఇండిగోపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో (IndiGo) సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు.

ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది చాలా అమానవీయ ఘటన అని రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇండిగోపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ స్పందించింది. ‘‘భయంతో ఉన్న ఆ చిన్నారి స్తిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం దాకా గ్రౌండ్‌ సిబ్బంది వేచి చూశారు. కానీ ఫలితం లేకపోయింది’’ అని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. అనంతరం ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరినట్లు తెలిపింది. ‘‘ఉద్యోగులైనా, ప్రయాణికులైనా అందరినీ కలుపుకొని వెళ్లే సంస్థ ఇండిగో. ప్రతి నెలా మా విమానాల్లో 75 వేల మంది దివ్యాంగులు ప్రయాణాలు చేస్తుంటారు’’ అని ఆ సంస్థ పేర్కొంది.

నేనే దర్యాప్తు చేస్తా: సింధియా

కాగా.. ఈ ఘటనపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదు. దీనిపై స్వయంగా నేను దర్యాప్తు చేపడతాను. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని ఇండిగోను హెచ్చరిస్తూ సింధియా ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించిందని, సంబంధిత విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని