DGCA: విమానంలోకి దివ్యాంగ బాలుడి ప్రవేశానికి నిరాకరణ ఘటన.. సంస్థకు డీజీసీఏ జరిమానా

ఇటీవల ప్రత్యేకవసరాలు కలిగిన ఓ చిన్నారిని విమానంలోకి రానివ్వని ఘటనలో సంబంధిత విమానయాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. తొలుత...

Updated : 28 May 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ప్రత్యేకవసరాలు కలిగిన ఓ చిన్నారిని విమానంలోకి రానివ్వని ఘటనలో  ఇండిగో విమానయాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝుళిపించింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. తొలుత ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ.. సంబంధిత ప్రయాణికులతో సిబ్బంది అనుచితంగా వ్యవహరించినట్లు తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు మే 27వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.

‘బాలుడి విషయంలో సిబ్బంది మరింత దయాగుణంతో వ్యవహరిస్తే పరిస్థితి చక్కబడేది. తద్వారా బోర్డింగ్ నిరాకరణ పరిస్థితి వచ్చేది కాదు. ప్రత్యేక సందర్భాల్లో సిబ్బంది మరింత గొప్పగా స్పందించాలి. కానీ, ఈ విషయంలో వారు విఫలమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించారు. కాబట్టి, రూ.5 లక్షల జరిమానా విధిస్తున్న’ట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించేందుకుగానూ.. నిబంధనలను పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఏం జరిగిందంటే..!

మే 7న హైదరాబాద్‌ వెళ్లేందుకు దివ్యాంగ బాలుడితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే, అతను విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఈ వ్యవహారం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో.. సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. స్వయంగా దర్యాప్తు చేపడతానని ప్రకటించారు. మరోవైపు డీజీసీఏ కమిటీ కూడా దర్యాప్తు చేపట్టింది. తాజాగా జరిమానా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని