IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!

దిల్లీ నుంచి బిహార్‌లోని పట్నాకు వెళ్లాల్సిన ఓ విమాన ప్రయాణికుడు.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చేరుకున్న ఘటన ఇది. ఈ వ్యవహారంలో డీజీసీఏ ‘ఇండిగో సంస్థ’ నుంచి నివేదిక కోరింది.

Published : 04 Feb 2023 02:37 IST

దిల్లీ: ఒకవైపు విమాన ప్రయాణికుడి పొరపాటు.. మరోవైపు తనిఖీల్లో ఎయిర్‌లైన్స్‌ నిర్లక్ష్యం.. వెరసి బిహార్‌లోని పట్నా(Patna)లో దిగాల్సిన వ్యక్తి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ (Udaipur Airport)కు చేరుకున్న వైనమిది. జనవరి 30న ఇండిగో (IndiGo) విమానంలో ఇది చోటుచేసుకుంది. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) తాజాగా విచారణకు ఆదేశించింది. అఫ్సర్‌ హుస్సేన్‌ అనే ప్రయాణికుడు పట్నా వెళ్లేందుకు గానూ దిల్లీ విమానాశ్రయానికి (Delhi Airport) చేరుకున్నాడు. పొరపాటున ఉదయ్‌పుర్‌ వెళ్లే విమానం ఎక్కాడు. తీరా గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం అసలు విషయం గ్రహించాడు. వెంటనే విమానాశ్రయ అధికారులను సంప్రదించాడు. వారు ఇండిగోకు సమాచారం అందించారు. దీంతో అదే రోజు అతడిని దిల్లీకి తీసుకొచ్చిన ఇండిగో.. మరుసటి రోజు పట్నాకు చేర్చడం గమనార్హం.

దీనిపై విమానయాన సంస్థ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఏం జరిగిందో పూర్తిగా ఆరా తీస్తున్నామని, ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరినట్లు డీజీసీఏ అధికారి వెల్లడించారు. ‘ప్రయాణికుడి బోర్డింగ్ పాస్‌ను పూర్తిస్థాయిలో ఎందుకు స్కాన్ చేయలేదు? నిబంధనల ప్రకారం బోర్డింగ్ పాస్‌లను రెండు చోట్ల తనిఖీ చేయాల్సి ఉండగా.. ప్రయాణికుడు వేరే విమానం ఎలా ఎక్కాడు?’ అనే విషయాలను తేల్చనున్నట్లు చెప్పారు. గత 20 రోజుల వ్యవధిలో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జనవరి 13న సైతం దిల్లీ నుంచి ఇండోర్ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు.. నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు