Indigo: టేకాఫ్‌ అవుతుండగా జారి.. బురదలో ఇరుక్కున్న విమానం టైరు

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ అవుతుండగా ప్రమాదవశాత్తూ రన్‌వే నుంచి జారిపడింది. దీంతో విమానం టైరు బురదలో

Updated : 29 Jul 2022 10:34 IST

గువాహటి: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ అవుతుండగా ప్రమాదవశాత్తూ రన్‌వే నుంచి జారి.. విమానం టైరు బురదలో చిక్కుకుపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

అస్సాంలోని జోర్హత్‌ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను క్షేమంగా కిందకు దించేశారు. అయితే ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు. వారిని మరో విమానంలో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా.. ఇటీవల కొంతకాలంగా పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయటపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న నిపుణులైన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. 8 వారాల పాటు స్పైస్‌జెట్‌ విమానాలను 50 శాతం మాత్రమే నడపాలని ఆంక్షలు విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని