IndiGo: ఆరుగురు ప్రయాణికులతో వెళ్లలేక.. విమాన సిబ్బంది ఏం చేశారంటే..?

ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సిబ్బంది తమను తప్పుదోవ పట్టించి విమానం నుంచి దింపేశారని ప్రయాణికులు ఆరోపించారు. ఇంతకీ ఏమైందంటే..

Updated : 21 Nov 2023 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండిగో (IndiGo) విమానంలో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఆరుగురు ప్రయాణికులతో విమానం నడిపేందుకు ఇష్టపడని సిబ్బంది.. వారికి మాయమాటలు చెప్పి దింపేశారు. గ్రౌండ్‌ సిబ్బంది తమను తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న ఆ ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. బెంగళూరు (Bengaluru)లోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఇండిగో విమానం 6E478 అమృత్‌సర్‌ (Amritsar) నుంచి చెన్నై (Chennai)కి బయలుదేరింది. చెన్నై చేరుకోవడానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. అందరూ దిగిపోయాక.. చెన్నై వెళ్లేందుకు ఆరుగురు ప్రయాణికులు మాత్రమే మిగిలారు. దీంతో.. తక్కువ మంది ప్రయాణికులతో విమానాన్ని నడిపేందుకు ఇష్టపడని ఇండిగో సిబ్బంది వారిని తెలివిగా దింపేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు ఏం జరిగిందో ఓ ప్రయాణికుడు వివరించాడు.

జీన్స్‌ వేసుకోవాలన్న అత్త.. చీరలే కడతానన్న కోడలు

‘‘ప్రయాణికులు దిగిపోయాక నేను విమానంలోనే కూర్చున్నా. నాతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంతలో ఇండిగో గ్రౌండ్‌ సిబ్బంది నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. చెన్నైకి వెళ్లేందుకు మరో ప్రత్యామ్నాయ విమానం ఉందని.. నా బోర్డింగ్‌ పాస్‌ కూడా సిద్ధంగా ఉందంటూ సిబ్బంది  ఒకరు మాట్లాడారు. అంతేకాకుండా, నా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పి కిందకు దిగాలని కోరారు. అది నమ్మి విమానం నుంచి దిగిపోయా. ఇదే విధంగా మిగిలిన వారికి కూడా ఫోన్‌ చేశారు. వారు కూడా దిగిపోయారు’’ అని తెలిపాడు.

తర్వాత మరో విమానాన్ని ఏర్పాటు చేయకపోవడంతో మోసపోయామని ఆ ప్రయాణికులు గ్రహించారు. కేవలం ఆరుగురితో విమానం నడపడం ఇష్టం లేకే ఈ విధంగా చేశారని ఆరోపించారు. మరోవైపు ఆ రాత్రి ఇండిగో సంస్థ తమకు ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి స్పందించారు. ‘ఆ రోజు ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు కొద్ది దూరంలోని హోటల్‌లో ఉన్నారు. మిగిలిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం వారిని మరో విమానంలో చెన్నైకి పంపించాం ’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని