Mount Semeru: మౌంట్‌ సెమేరు బీభత్సం.. భయంతో జనాలు పరుగులు!

ఇండోనేసియాలోని అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు’ శనివారం మధ్యాహ్నం బద్ధలైంది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇది విస్ఫోటనం చెందింది. ఈ క్రమంలో భారీఎత్తున పొగ, బూడిద ఆవరించడంతో.. పరిసరాలన్నీ చీకటిమయమయ్యాయి...

Updated : 05 Dec 2021 17:04 IST

జకర్తా: ఇండోనేసియాలోని అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు’ శనివారం మధ్యాహ్నం బద్ధలైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇది విస్ఫోటనం చెందింది. ఈ క్రమంలో భారీఎత్తున పొగ, బూడిద ఆవరించడంతో పరిసరాలన్నీ చీకటిమయమయ్యాయి. భయాందోళనతో వేలాది మంది స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని ఆ దేశ విపత్తు నివారణ సంస్థ తెలిపింది.

పెద్దఎత్తున లావా పరిసర గ్రామాలకు విస్తరించడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. నిర్వాసితుల కోసం లుమాజాంగ్‌లో తాత్కాలిక షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఆ అగ్నిపర్వతం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో నిషేధిత జోన్‌ ఏర్పాటు చేశారు. 2020 డిసెంబరులోనూ ఇది ఒకసారి బద్ధలైంది. ఇండోనేసియాలో తరచూ అగ్నిపర్వతాలు బద్ధలవుతాయన్న విషయం తెలిసిందే. ఈ ఆగ్నేయాసియా దేశంలో దాదాపు 130 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. 2018లో జావా, సుమత్రా దీవుల మధ్య సముద్రంలోని ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, సునామీ సంభవించి.. 400 మందికి పైగా మృతి చెందారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని