Swachh Awards: పరిశుభ్ర నగరాల్లో ఇండోర్‌ ఆరోసారి.. టాప్‌-3 నుంచి విజయవాడ మిస్‌

Swachh Survekshan Awards 2022: స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో మరోసారి ఇండోర్‌ సత్తా చాటింది. వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

Updated : 01 Oct 2022 20:22 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం మరోసారి సత్తా చాటింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా ఆరోసారీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సూరత్‌, నవీ ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.  రాష్ట్రాల జాబితాలో  మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

 

పరిశుభ్ర నగరాల జాబితాలో ఇండోర్‌, సూరత్‌ మరోసారి తొలి స్థానాలను నిలుపుకోగా.. మూడో స్థానంలో ఉన్న విజయవాడ తన స్థానాన్ని నవీ ముంబయికి అప్పగించి నాలుగో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను శనివారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి పాల్గొన్నారు.

  • లక్షలోపు  జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గని తొలి స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్‌ (ఎన్‌పీ), మహారాష్ట్రలోని కర్హాడ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • లక్షకు పైగా జనాభా కలిగిన గంగా నగరాల జాబితాలో హరిద్వార్‌ తొలి స్థానంలో నిలవగా.. వారణాశి, రిషికేశ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన గంగా నగరాల జాబితాలో బిజ్నౌర్‌, కన్నౌజ్‌, గర్హ్ముక్తేశ్వర్ టాప్‌-3లో చోటు దక్కించుకున్నాయి.
  • మహారాష్ట్రలోని దేవ్‌లాలి అత్యంత పరిశుభ్ర కంటోన్మెంట్‌ బోర్డుగా తొలి స్థానం దక్కించుకుంది.
  • 2016లో కేవలం 73 నగరాలకే పరిమితం అయిన ఈ సర్వేను ఈ ఏడాది 4,354 నగరాలకు విస్తరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని