
Water plus: భారత్లో తొలి ‘వాటర్ ప్లస్’ నగరంగా ఇండోర్
‘స్వచ్ఛ సర్వేక్షన్ 2021’లో భాగంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఇండోర్: భారతదేశంలో స్వచ్ఛమైన నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2021’లో భాగంగా ఇండోర్ నగరం.. దేశంలోనే తొలి ‘వాటర్ ప్లస్’ నగరంగా గుర్తింపు పొందినట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘స్వచ్ఛ సర్వేక్షన్ 2021’లో భాగంగా తొలి ‘వాటర్ ప్లస్’ నగరంగా నిలిచినందుకు ఇండోర్ ప్రజలకు నా అభినందనలు. పరిశుభ్రత పట్ల మీకున్న చిత్తశుద్ధి యావత్ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచింది. ఇదే తీరు కొనసాగించి.. రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
వాటార్ప్లస్ గుర్తింపు కోసం ఇవి పాటించాలి..
నదులు, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచుకున్న నగరాలకు వాటర్ప్లస్ సిటీ అనే సర్టిఫికెట్ వస్తుంది. ఇండోర్ మున్సిపల్ కమిషనర్ ప్రతిభా పాల్ ఇదే అంశంపై మాట్లాడుతూ.. ‘‘ వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్ గుర్తింపు పొందేందుకు నగరవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించాం. ఆపై ఈ వాటర్ ప్లస్ మార్గదర్శకాలను పాటించాం. దీని ప్రకారం.. నగరంలోని మురుగు నీరు ఎటువంటి నదులు, డ్రైన్స్లో కలవకూడదు. బహిరంగ ప్రదేశాల్లోని టాయిలెట్స్కి కచ్చితంగా డ్రైనేజీ పంపులతో అనుసంధానం చేసి.. పరిశుభ్రతను పాటించాలి. 30శాతం మురుగు నీటిని పునర్వినియోగమయ్యేలా చూడాలి. అందులోనుంచి వచ్చిన నీటిని భవనాల నిర్మాణం, చెట్లపెంపకానికి వినియోగించాలి. నగరంలో ఏడు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను నిర్మించి.. అందులో శుద్ధి అయిన నీరు.. రోజుకి సుమారు 110 మిలియన్ల లీటర్లు వాడాలి. అదేవిధంగా 147 మూత్రశాలలను నిర్మించి బావులు, చెరువులను శుద్ధి చేయాలి’’ అంటూ పాటించిన మార్గదర్శకాలను వివరించారు.