రాజేశ్ సహాయ్‌..  ‘డాక్టర్‌’ పోలీస్‌

ఓ వైపు లాఠీ పట్టుకుని శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని ఎంతో మంది ప్రాణాలు నిలుపుతున్నారు. మాయదారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న

Published : 01 May 2021 15:36 IST

ఇండోర్‌: ఓ వైపు లాఠీ పట్టుకుని శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని ఎంతో మంది ప్రాణాలు నిలుపుతున్నారు. మాయదారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. మధ్యప్రదేశ్‌లో ఓ పోలీసు అధికారి డాక్టర్‌గా మారారు. గతంలో వైద్య వృత్తిని చేపట్టిన అనుభవంతో ఇప్పుడు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. ఆయన ఇండోర్‌ ఎస్పీ రాజేశ్‌ సహాయ్‌.

రాజేశ్ సహాయ్‌ తొలుత ఎంబీబీఎస్‌, ఎండీ విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఓ పెద్ద ఆసుపత్రిలో ఐసీయూ ఇన్‌ఛార్జ్‌గానూ పనిచేశారు. అదే సమయంలో సివిల్స్‌ పరీక్ష రాసి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఇండోర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసు అయినప్పటికీ వైద్య వృత్తిని మర్చిపోలేదు. ఇటీవల ఇండోర్‌లో చాలా మంది పోలీసు అధికారులు కరోనా బారిన పడటంతో వారి కోసం ప్రత్యేకంగా ఆసుపత్రికి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాజేశ్ మళ్లీ వైద్య వృత్తిని చేపట్టారు. ఓ వైపు ఎస్పీగా విధులు నిర్వహిస్తూనే ఆసుపత్రికి వెళ్లి కరోనా సోకిన పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘పోలీసు శాఖ నాకు కుటుంబం లాంటిది. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా బాధితులకు నా వంతు సాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏముంటుంది? కరోనా అని తెలియగానే చాలా మంది భయపడుతున్నారు. వారికి చికిత్సతో పాటు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

కరోనా విపత్తు వేళ అటు పోలీసుగా.. ఇటు డాక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్న రాజేశ్‌ను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. నిజంగా రాజేశ్ సహాయ్‌ గ్రేట్‌ ‘డాక్టర్‌’ పోలీస్‌ కదా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు