Indrani Mukerjea: జైలు నుంచి విడుదలైన ఇంద్రాణీ ముఖర్జియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీయా జైలు నుంచి విడుదలయ్యారు.....

Published : 20 May 2022 20:10 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీయా జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసిన ముంబయి జైలు అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ కేసు విచారణ త్వరలో ముగిసే అవకాశం కనపడటంలేదని, ఆమె ఆరున్నరేళ్లు (2015 నుంచి)గా జైల్లో ఉండటం సుదీర్ఘ కాలమని పేర్కొంటూ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ బుధవారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

2012లో తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం 237 మంది సాక్షులను విచారించాల్సి ఉండగా ఇప్పటివరకు 68 మందినే ప్రశ్నించారని, మిగతా వారి ప్రాసిక్యూషన్‌ పూర్తికి ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల పేర్కొంది. అయితే, నిన్ననే ఆమె విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి కాలేదు. దీంతో ఈ రోజు విడుదల చేశారు. 2015 నుంచి జైలులో ఉంటున్న ఇంద్రాణీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఫిబ్రవరిలో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇంద్రాణీ దేశం విడిచి వెళ్లరాదు.. సాక్షులతో సంప్రదింపులు జరపరాదంటూ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని