NDA: 40 ఏళ్లలో నా స్థానంలో ఓ మహిళా అధికారి ఉంటారు

నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో మహిళలకూ అంతే నిజాయతీతో, అంతే ప్రొఫెషనలిజంతో స్వాగతం లభిస్తుందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. సాయుధ దళాల్లో లింగ సమానత్వం దిశగా దీన్ని మొదటి అడుగుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం...

Published : 29 Oct 2021 14:37 IST

ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే

దిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో మహిళలకూ అంతే నిజాయతీతో, అంతే ప్రొఫెషనలిజంతో స్వాగతం లభిస్తుందని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. సాయుధ దళాల్లో లింగ సమానత్వం దిశగా దీన్ని మొదటి అడుగుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎన్‌డీఏ 141వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్‌డీఏలో మహిళల ప్రవేశంతో వారికి సాధికారత లభిస్తుందని తెలిపారు. రానున్న 40 ఏళ్లలో వారు ప్రస్తుతం తానున్న హోదాలో ఉంటారని ఆకాంక్షించారు. ‘ఏళ్లు గడిచేకొద్దీ ఎన్‌డీఏ అభివృద్ధి చెందుతోంది. కరిక్యులం మారుతోంది. శిక్షణా పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. కోర్సు కంటెంట్ మెరుగుపడింది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాం. ఇప్పుడు అకాడమీలో మహిళా కేడెట్‌లను చేర్చుకుంటున్నాం. వారు కచ్చితంగా పురుషుల కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చుతారు’ అని నరవణే వివరించారు.

‘శిక్షణ ప్రమాణాల్లో ఎటువంటి మార్పు ఉండబోదు..’

రానున్న 20- 30 ఏళ్లలో సాయుధ దళాల్లో మహిళల పాత్ర విషయంలో అడిగిన ప్రశ్నకు నరవణే బదులిస్తూ.. 40 ఏళ్లలో ప్రస్తుతం తాను నిలబడిన చోటే వారు నిలబడతారని పేర్కొన్నారు. మహిళలు ఎన్‌డీఏలో చేరుతున్న నేపథ్యంలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు స్వల్పంగా మారతాయని, శిక్షణ మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. శిక్షణ ప్రమాణాల్లో ఎటువంటి తేడా ఉండదని, సంయుక్తంగా జరుగుతుందని వివరించారు. ఇప్పటికే చెన్నైలోని ఓటీఏ(ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ)లో శిక్షణ పొందుతున్న మహిళా అధికారులు చాలా బాగా రాణిస్తున్నారని చెప్పారు. మరోవైపు కేడెట్లు సైతం.. సరికొత్త సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావడం ఎంతో గౌరవంగా ఉందని.. 42 ఏళ్ల క్రితం తానూ ఓ కేడెట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని వివరించారు. ఈ ఏడాది నవంబర్‌ నుంచి ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళా అభ్యర్థులకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని