Delta Plus: డెల్టాప్లస్‌ వైరస్‌ తీవ్రతపై నిపుణుల సమీక్ష!

 అత్యధిక వేగంగా విస్తరిస్తోన్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తీవ్రతను అంచనా వేసేందుకు జాతీయ స్థాయిలో ఏర్పాటైన కొవిడ్‌ నిపుణుల బృందం నేడు భేటీ కానుంది.

Published : 25 Jun 2021 19:44 IST

డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై నేడు INSACOG సమావేశం

దిల్లీ: దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టాప్లస్‌ కరోనా రకం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే నివేదికలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దీనిని ఆందోళనకర వేరియంట్‌గా కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు అత్యధిక వేగంగా విస్తరిస్తోన్న ఈ కొత్త వేరియంట్‌ తీవ్రతను అంచనా వేసేందుకు జాతీయ స్థాయిలో ఏర్పాటైన జినోమిక్స్‌ కన్సార్టియం నేడు భేటీ కానుంది.

డెల్టాప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడమే కాకుండా మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. డెల్టా ప్లస్‌ను ఆందోళనకర రకంగా ప్రకటించింది. ఈ కేసులు వెలుగు చూసిన రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కరోనా టెస్టింగ్‌, ట్రాకింగ్‌ను పెంచాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌ వ్యాప్తి రేటు, తీవ్రతను అంచనా వేసేందుకు పది జాతీయ పరిశోధనా కేంద్రాలతో కూడిన ఇండియన్‌ సార్స్-కోవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జినోమిక్స్‌ (INSACOG) నేడు మరోసారి సమీక్ష జరుపనుంది. అనంతరం మరోసారి అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసే అవకాశం ఉంది.

మూడో ముప్పు భయం!

అత్యధిక వేగంతో వ్యాప్తి చెందగల సామర్థ్యం ఉన్న ఈ వేరియంట్‌ వల్ల మూడో ముప్పు వచ్చే అవకాశం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్‌ ఉత్పరివర్తనం చెందడం సాధారణ ప్రక్రియేనని, అది అనివార్యమని వైరాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మార్పులను నియంత్రించడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. అయితే థర్డ్‌ వేవ్‌కు ఈ వేరియంట్‌ కారణమవుతుందనుకోవడం మాత్రం తొందరపాటేనని ఐసీఎంఆర్‌ నిపుణులు డాక్టర్‌ సుమిత్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. థర్డ్‌వేవ్‌కు ఈ రకం ఒక్కటే కారణం కాకపోవచ్చని, వైరస్‌ మరోసారి విజృంభించడానికి ఇతర కారణాలు కూడా దోహదం చేస్తాయన్నారు. వేరియంట్‌ ఏదైనా.. సరైన జాగ్రత్తలను పాటించడం ద్వారానే వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడమే అసలైన ఆయుధాలని సూచించారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40 డెల్టాప్లస్‌ వేరియంట్‌ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో ఇవి బయటపడ్డాయి. పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని