Kafi: విధి వక్రించినా.. ఆత్మ విశ్వాసమే ఆమెను గెలిపించింది!

యాసిడ్‌ దాడిలో (Acid Attack) కళ్లు కోల్పోయినా నిరాశపడకుండా..చదువుకోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్లింది ఛండీగఢ్‌ (Chandigarh)చెందిన కఫి. సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో 95.02శాతం మార్కులు సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

Published : 14 May 2023 19:38 IST

చండీగఢ్‌: అన్ని వనరులు ఉన్నా.. వాటిని సరిగా ఉపయోగించుకోలేక కెరీర్‌లో ఇబ్బందులు పడిన విద్యార్థులు ఎందరో. జీవితంలో స్థిరపడలేక తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభ మిగిల్చిన వారూ ఉంటారు. అలాంటి వారందరిలో ప్రేరణ నింపుతోంది చండీగఢ్‌కు (Chandigarh) చెందిన 15 ఏళ్ల కఫి (Kafi). విధి వక్రించి కళ్లు కోల్పోయినా..ఆత్మవిశ్వాసమే శ్వాసగా ముందుకు సాగి.. రెండు రోజుల క్రితం విడుదలైన సీబీఎస్‌ఈ ఫలితాల్లో 95.02 శాతం మార్కులు సాధించింది. ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.

కఫి వాళ్ల తండ్రి స్థానిక సెక్రెటేరియేట్‌లో ప్యూన్‌గా పని చేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల వయస్సులో పక్కింటి వాళ్లు అసూయతో ముఖంపై యాసిడ్‌ పోసేశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు ఆరేళ్లపాటు విడతల వారీగా వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రాణాలు మిగిలినా.. కళ్లు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కొన్నాళ్లపాటు ఇంట్లోనే ఉన్న కఫి.. చదువు పట్ల ఆసక్తితో బ్రెయిలీ లిపిలో చదవడం మొదలు పెట్టింది. చదువులో చురుగ్గా రాణిస్తున్న ఆమెకు తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా చక్కని ప్రోత్సాహం అందించారు. ఫలితంగా సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో కఫి 95.02శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఎంతో మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది.

ఐఏఎస్‌ అధికారి కావాలన్నదే తన ఆశయమని కఫి చెబుతోంది. తల్లిదండ్రులను గర్వపడేలా జీవితంలో స్థిరపడాలన్నదే తన కోరిక అని ఆమె మీడియాకు వెల్లడించింది. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని అంటోంది. కొన్ని పాఠ్యాంశాలను యూట్యూబ్‌ ద్వారా విని తెలుసుకొని పరీక్షలకు సన్నద్ధమైనట్లు ఆమె చెప్పింది. కఫి సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఆమె తమ కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నామని, ఆమె లక్ష్యాన్ని చేరుకునేందుకు  కృషి చేస్తామని కఫి తండ్రి అన్నారు. తమ కుమార్తె చదువులో చాలా చురుగ్గా ఉంటుందని, ఆమె సాధించిన ఈ విజయం తమను సమాజంలో తలెత్తుకునేలా చేసిందని ఆమె తల్లి ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని