Intel alert: ఉగ్ర దాడులకు అవకాశం ఉంది.. జాగ్రత్త! నిఘా వర్గాల హెచ్చరిక

దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఐబీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. .....

Published : 04 Sep 2021 18:41 IST

దిల్లీ: దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించారు. జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కారు పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ముష్కర మూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 6న ఇజ్రాయెల్‌ పౌరుల సెలవులు ప్రారంభం కానున్నందున వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఇందుకోసం ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌ సిబ్బంది, వారి నివాసాలు, కోషెర్‌ రెస్టారెంట్‌, చాబాద్‌ హౌస్‌, యూదుల కమ్యూనిటీ సెంటర్‌ వంటి ప్రాంతాల్లో  వచ్చే నెలాఖరు వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పెంచాలన్నారు. ఇజ్రాయెల్‌ పౌరుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని