Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో 38 మంది పాక్‌ ఉగ్రవాదులు..!

జమ్మూకశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ఇందుకోసం తమ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తున్నాయి.

Published : 12 Nov 2021 13:25 IST

నిఘా వర్గాల సమాచారం.. కశ్మీర్‌కు అదనపు బలగాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ఇందుకోసం తమ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తున్నాయి. అలా ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో కనీసం 38 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనావేశాయి. ఈ ముష్కరుల కదలికలపై భద్రతాబలగాలు నిఘా పెట్టినట్లు సమాచారం. 

కశ్మీర్‌ లోయలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్థానీ ఉగ్రవాదుల జాబితాను నిఘా వర్గాలు తయారుచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ జాబితా ప్రకారం.. ప్రస్తుతం 38 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నారు. వీరిలో 27 మంది లష్కరే తోయిబా ముఠాకు చెందినవారు కాగా.. మిగతా 11 మంది జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందినవారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా ఉగ్రదాడుల్లో శిక్షణ తీసుకుని భారత్‌కు వచ్చినట్లు తెలిసింది. 

వీరిలో అత్యధికంగా పుల్వామా, బారాముల్లా ప్రాంతాల్లో నక్కినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో 10 మంది చొప్పున పాక్‌ ముష్కరులు దాగి ఉండగా.. శ్రీనగర్‌లో నలుగురు, కుల్గామ్‌లో ముగ్గురు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనాకొచ్చాయి. మిగిలిన 11 మంది ఇతర ప్రాంతాల్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉండి హైబ్రీడ్‌ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంటున్నారని, వారితో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 

నిఘా వర్గాల సమాచారంతో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులను అరికట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఇటీవల కశ్మీర్‌ లోయలో మైనార్టీలు, వలసదారులపై వరుస దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో కశ్మీర్‌ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు, వారి అనుచరులను అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు