PM Modi: అలా అనే ధైర్యం ఎవ్వరికీ లేదు : మోదీ

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2023)ను ఎన్నికల బడ్జెట్‌ అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అది పేదలు, వెనకబడిన వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని చెప్పారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. వచ్చే ఎన్నికల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

Published : 07 Feb 2023 15:24 IST

దిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల (2024 Lok Sabha Elections) కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నేడు దిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఎంపీలు ఓటర్లకు చేరువైతే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉండదన్నారు.

కేంద్ర బడ్జెట్‌ (Budget 2023-2024) ప్రవేశపెట్టిన తర్వాత భాజపా పార్లమెంటరీ పార్టీ తొలిసారి భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించిన మోదీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ అయినప్పటికీ.. ఇది ‘ఎన్నికల బడ్జెట్‌’ అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. పార్టీ ఎంపీలు తమ తమ  నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో మమేకం అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత (Anti-incumbency) ఉండదని ఉద్ఘాటించారు. బడ్జెట్‌లో పేదలు, వెనకబడిన వర్గాల వారిపైనే దృష్టి సారించామని.. సైద్దాంతికంగా భాజపాను వ్యతిరేకించే వారు కూడా బడ్జెట్‌ను స్వాగతించారని ప్రధాని మోదీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ విలేకరులకు వెల్లడించారు.

పట్టణప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు క్రీడా సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించినట్లు ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు. క్రీడల్లో యువత ఎక్కువగా భాగస్వామ్యం కావడం లేదనే భావనతో ఈ విధంగా సూచించినట్లు చెప్పారు. జీ-20 సమావేశాల కోసం భారత్‌కు వస్తోన్న విదేశీ అతిథులు.. ఇక్కడి ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారని అన్నారు. ఇక తుర్కియే, సిరియాలో భూకంప విలయాన్ని ప్రస్తావించిన మోదీ.. ఆపదలో ఉన్న ఆ దేశాలకు భారత్‌ సహాయం అందిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని