Interpol: ఖలిస్థానీ నేతపై రెడ్‌కార్నర్‌ నోటీసుకు ఇంటర్‌పోల్‌ అభ్యంతరాలు..!

ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూపై రెడ్‌కార్నర్‌ నోటీసీ జారీ చేయాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను ఇంటర్‌పోల్ (ది ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌) తిప్పిపంపింది.

Published : 13 Oct 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు గురుపట్వంత్‌ సింగ్‌ పన్నూపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను ఇంటర్‌పోల్ (ది ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌) తిప్పి పంపింది. భారత్‌లోని పలు నిఘా ఏజెన్సీల నుంచి సీబీఐ సేకరించిన సమాచారాన్ని ఇంటర్‌పోల్‌కు ఇప్పటికే అందించారు. కానీ, ఆ సంస్థ పలు సందేహాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థనను తిప్పి పంపింది. ఖలిస్థాన్‌ మద్దతు సంస్థ ఎస్‌ఎఫ్‌జే సహ వ్యవస్థాపకుడు, న్యాయ సలహాదారుగా పన్నూ వ్యవహరిస్తున్నాడు.

పన్నూను సిక్కు వేర్పాటువాద నేతగా అంగీకరించే విషయంలో ఇంటర్‌పోల్‌ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ, అతడు రాజకీయ కార్యకలాపాల్లో  కూడా పాల్గొంటుండటంతో ఇంటర్‌పోల్‌ చట్టం ప్రకారం రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయడం సాధ్యం కాదని పేర్కొంది.

ఎస్‌ఎఫ్‌జే సంస్థ నేత జస్వీందర్‌ సింగ్‌ ముల్తానీ సమాచారం తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు  ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.  ఇతడు పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో కలిసి ముంబయిలో ఉగ్రకార్యకలాపాలకు కుట్రపన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముల్తానీ.. పన్నూకు సన్నిహితుడు. పంజాబ్‌ సరిహద్దులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేసినట్లు కూడా ముల్తానీపై ఆరోపణలు ఉన్నాయి. 

నేరగాళ్లు ఆయా దేశాల చట్టాల నుంచి తప్పించుకోవడానికి దేశాల సరిహద్దులు దాటి పారిపోతుంటారు. అటువంటి వారి విషయంలో ప్రపంచ దేశాల పోలీస్‌ బృందాలను అప్రమత్తం చేయడానికి ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులను జారీ చేస్తుంది. ఈ నోటీసులో నిందితుడిని గుర్తించడానికి అవసరమైన సమాచారం ఉంటుంది. దీంతోపాటు సదరు నిందితుడు పాల్పడిన నేరాల జాబితా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని