PFI: పీఎఫ్‌ఐ ‘మిషన్‌ 2047’.. సభ్యుల ఇళ్లల్లో బాంబు తయారీ పత్రాలు

ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

Published : 28 Sep 2022 12:06 IST

ఎన్‌ఐఏ దాడుల్లో కీలక సమాచారం లభ్యం

దిల్లీ: ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఎన్ఐఏ దేశవ్యాప్త దాడుల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ సోదాల్లో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలకమైన ‘నేరపూరిత పత్రాలను’ స్వాధీనం చేసుకున్నాయి. పీఎఫ్‌ఐ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలకు ఆధారంగా పేర్కొంటున్న ఆ పత్రాల వివరాలను దర్యాప్తు ఏజెన్సీలు తాజాగా బయటపెట్టాయి.

పీఎఫ్‌ఐ సభ్యుల నివాసాల్లో బాంబు తయారీ కోసం ఉపయోగించే మ్యానువల్స్ లభించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో పీఎఫ్‌ఐ నేత మహ్మద్‌ నదీమ్‌ నివాసం నుంచి ఓ బుక్‌లెట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. ‘సులువుగా దొరికే వస్తువులతో శక్తిమంతమైన ఐఈడీలను ఎలా తయారు చేయాలి’ అనే దానిపై ఆ బుక్‌లెట్‌లో షార్ట్‌కోర్స్‌ ఉందని అధికారులు తెలిపారు.

ఇక, మహారాష్ట్రలో పీఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడి నివాసం నుంచి ‘మిషన్‌ 2047’కు సంబంధించిన బ్రోచర్‌, సీడీ, వందలాది నేరపూరిత పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చేందుకు అవసరమయ్యే ప్రణాళికలు ఈ మిషన్‌ 2047లో ఉన్నట్లు సమాచారం. మరో పీఎఫ్‌ఐ సభ్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లో ఐసిస్‌, గజ్వా-ఎ-హింద్‌ వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించాయని, ఈ సంస్థ సభ్యులపై 1300కు పైగా కేసులు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. 

పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల ఎన్‌ఐఏ.. ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. పలు చోట్ల దాడులు చేపట్టి వందల మంది సభ్యులను అరెస్టు చేసింది. ఈ దాడుల్లో దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లష్కరే, ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పీఎఫ్‌ఐ యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేగాక, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఈ సంస్థ కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని