Australia Murder: ఆ ఆస్ట్రేలియా యువతి హత్య వెనక అసలు కారణమదే..!

రాజ్‌విందర్ సింగ్ ఆస్ట్రేలియా యువతిని హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. క్షణికావేశమే ఈ ఘటనకు కారణంగా కనిపిస్తోంది. 

Published : 27 Nov 2022 01:35 IST

దిల్లీ: నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి భారత్‌లో తలదాచుకుంటున్న నిందితుడు రాజ్‌విందర్‌ సింగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ యువతిని హత్య చేయడానికి గల కారణాలను దర్యాప్తు బృందం వెల్లడించింది. 

తన భార్యతో గొడవపడి నిందితుడు రాజ్‌విందర్ సింగ్‌(38) క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వెంట కొన్ని పండ్లు, కూరగాయల కత్తిని తీసుకెళ్లాడు. అదే సమయంలో మృతురాలు తొయా కార్డింగ్లే ఆ బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్నారు. అప్పుడు తన వెంట పెంపుడు శునకం కూడా ఉంది. అయితే అది సింగ్‌ వైపు చూసి మొరిగింది. అది నచ్చని అతడు యువతితో గొడవకు దిగాడు. తర్వాత ఘర్షణ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన సింగ్ ఆమెపై దాడిచేసి, చంపేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను అక్కడి ఇసుకలో పాతిపెట్టి, కుక్కను అక్కడి చెట్టుకు కట్టేసి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పంజాబ్‌కు చెందిన సింగ్ నర్సింగ్‌ అసిస్టెంట్‌. కార్డింగ్లే ఫార్మసీ ఉద్యోగిని. 2018, అక్టోబర్ 21న కనిపించకుండాపోయారు. తర్వాత రోజు వాంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం దొరికింది.

ఈ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింగ్‌ తన ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లల్ని వదిలేసి భారత్‌కు వచ్చేశాడు. అతడి ఆచూకీ కోసం ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేసింది. అతడి అప్పగింతకు భారత్‌ నుంచి ఆమోదం లభించడంతో పటియాలా కోర్టు నవంబర్ 21న నాన్‌బెయిల్‌ వారెంట్‌ను జారీ చేసింది.  ఇంతకుముందు క్వీన్స్‌లాండ్‌ పోలీసులు.. రాజ్‌విందర్‌ ఆచూకీ తెలిపిన వారికి మిలియన్‌ డాలర్లు (రూ.8.17 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని