Corona: వైరస్‌ మూలాలపై అమెరికాకు వెళ్లాల్సిందే!

కరోనా మహమ్మారి వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ కాలేదని బలంగా వాదిస్తూ వస్తోన్న చైనా.. ఇప్పుడు తప్పును అమెరికా మీదకు నెట్టేసేందుకు గట్టిగానే పూనుకుంది.

Published : 04 Jun 2021 17:06 IST

ఫౌచీ వ్యాఖ్యలపై చైనా స్పందన 

బీజింగ్‌: కరోనా మహమ్మారి వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ కాలేదని బలంగా వాదిస్తూ వస్తోన్న చైనా.. ఇప్పుడు తప్పును అమెరికా మీదకు నెట్టేసేందుకు గట్టిగానే పూనుకుంది. ఇప్పటికే ‘కరోనాను పుట్టించింది అగ్రరాజ్యమే’ అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తోన్న డ్రాగన్‌.. తాజాగా వైరస్‌ మూలాలను అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థను తమ దేశానికి అమెరికా ఆహ్వానించాలని వ్యాఖ్యలు చేసింది. 

కరోనా వ్యాప్తికి కొద్ది రోజుల ముందు వుహాన్‌ ల్యాబ్‌లో అనారోగ్యానికి గురైన సిబ్బంది వైద్య నివేదికలు విడుదల చేయాలంటూ అమెరికా అంటు వ్యాధుల చికిత్స నిపుణులు ఆంటోనీ ఫౌచీ కోరారు. వారు నిజంగానే జబ్బు పడ్డారా? ఎందువల్ల అనారోగ్యానికి గురయ్యారో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఆ నివేదికలు బయటికొస్తే వైరస్‌ మూలాలపై కీలకమైన ఆధారాలు లభిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫౌచీ వ్యాఖ్యలపై చైనా ఘాటుగానే స్పందించింది. 

‘‘డిసెంబరు 30, 2019కి ముందుకు వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌లో ఎవరికీ కరోనా వైరస్‌ సోకలేదు. వైరస్‌ మూలాలపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థను అమెరికా తమ దేశానికి ఆహ్వానించాలి. ఫోర్ట్‌ డెట్రిక్‌ ల్యాబ్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు ఉన్న 200లకు పైగా బయో ల్యాబ్స్‌ గురించి వివరణ ఇవ్వాలి’’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. 

ఆంటోనీ ఫౌచీకి చెందిన దాదాపు 3వేల పేజీల ఈమెయిళ్లు తాజాగా బహిర్గతమైన విషయం తెలిసిందే. అందులో కొన్నింటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరోనా తొలినాళ్లలో వుహాన్‌ ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని ఆయన కొట్టిపారేయడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. వుహాన్‌ ల్యాబ్‌లో ఏం జరుగుతుందో తెలిసినా ఫౌచీ అబద్ధాలు చెప్పారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలినాళ్లలో ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించిన ఫౌచీ.. ఇటీవల మాట మార్చడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని