ఎమ్మెల్యేలందరికీ గహ్లోత్‌ సర్కార్‌ సర్‌ప్రైజ్‌.. గిఫ్ట్‌గా ఒక్కొక్కరికీ ఐఫోన్‌ 13!

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాజస్థాన్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ ఐఫోన్‌ 13ని కానుకగా ఇచ్చింది. గతేడాది బడ్జెట్‌ ప్రతులతో పాటు ఐపాడ్‌లను ఇచ్చిన అశోక్‌ గహ్లోత్‌....

Published : 24 Feb 2022 01:36 IST

జైపూర్‌: బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాజస్థాన్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ ఐఫోన్‌ 13ని కానుకగా ఇచ్చింది. గతేడాది బడ్జెట్‌ ప్రతులతో పాటు ఐపాడ్‌లను ఇచ్చిన అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఈసారి అందరికీ ఐఫోన్లు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. సాధారణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులందరికీ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రతులను అందజేస్తుంటారు. కానీ ఈసారి స్మార్ట్‌ లెథర్‌ బ్రీఫ్‌కేసులో దాదాపు రూ.75 వేల నుంచి రూ.లక్ష విలువ చేసే ఐఫోన్‌ను బడ్జెట్‌ కాపీతో పాటు ఇవ్వడం విశేషం. ఈ కానుకలకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చవుతుంది. గహ్లోత్‌ సర్కార్‌ ఇచ్చిన ఈ కానుకను పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది చివరిలో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ బడ్జెట్‌పై ప్రత్యేక దృష్టిసారించారు.

సీఎం అశోక్‌ గహ్లోత్‌ బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ పథకాన్ని ప్రకటించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం, గృహ వినియోగానికి 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స సహా పలు ప్రతిపాదనలు చేశారు. కొత్త పన్నులు విధించకపోవడంతో పాటు అన్ని రంగాలకు దాదాపు రూ.1500 కోట్ల విలువైన ఉపశమనం అందించారు. పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల పాటు కల్పించనున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఎప్పటిలాగే, సమాజంలోని ప్రతి వర్గాన్నీ సంతృప్తి పరిచేలా జాగ్రత్త వహించామన్నారు. ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల కోసం సీఎం కృషక్‌ సాథి యోజన పథకానికి రూ.5వేల కోట్లు కేటాయించారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా 11 మిషన్లు చేపట్టనున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే, 19 జిల్లాల్లో 36 మహిళా కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధిని రూ.100 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచిన ముఖ్యమంత్రి.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) వారి కోసం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని