భారత ఇంధన అవసరాలు తీర్చేందుకు ముందుకొచ్చిన ఇరాన్‌

భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి అలీ చెగెనీ చెప్పారు.

Updated : 19 Mar 2022 16:16 IST

దిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చమురు దిగుమతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఇరాన్‌ కీలక ప్రతిపాదన చేసింది. భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని భారత్‌లోని ఆ దేశ రాయబారి అలీ చెగెనీ చెప్పారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌కు ఇరాన్‌ రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఆ దేశ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో భారత్‌ తన దిగుమతులను నిలిపివేసింది. దీంతో ద్వైపాక్షిక వాణిజ్యం క్షీణించింది. మరోవైపు ఆంక్షలు ఎత్తివేత కోసం ప్రపంచ దేశాలతో ఇరాన్‌ చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో చెగెనీ చమురు గురించి ప్రస్తావించారు. రుపీ-రియాల్‌ ట్రేడ్‌ మెకానిజం వల్ల రెండు దేశాల కంపెనీలూ లాభపడతాయని, మధ్యవర్తిత్వ ఖర్చులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు.

భారత్‌- ఇరాన్‌ మధ్య బార్టర్‌ పద్ధతిలో వాణిజ్యం జరుగుతుంది. ఇరాన్‌ చమురుకు భారత రిఫైనరీలు రూపాయల్లో చెల్లింపులు చేస్తాయి. అలాగే, ఇరాన్‌ సైతం భారత్‌ నుంచి వచ్చే దిగుమతులకు రూపాయల్లోనే చెల్లింపులు చేస్తుంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ చమురును భారత్‌ నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం భారీగా క్షీణించింది. 2019లో 17 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యం విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని