Second Wave: రెండో ముప్పు ముగిసినట్లేనా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, కొవిడ్‌ పాజిటివిటీ రేటు వరుసగా 14రోజులపాటు 5శాతం కన్నా తక్కువగా ఉంటే ఆంక్షలు సడలించడం, తిరిగి అన్ని కార్యకలాపాలను తెరచుకోవచ్చని సూచిస్తోంది.

Published : 22 Jun 2021 00:20 IST

ఆరోగ్యరంగ నిపుణులు ఏం చెబుతున్నాయంటే..!

దిల్లీ: తుపానులా విరుచుకుపడ్డ కరోనా సెకండ్‌ వేవ్‌ దాటికి యావత్‌ దేశం వణికిపోయిన విషయం తెలిసిందే. అయితే, గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, కొవిడ్‌ పాజిటివిటీ రేటు వరుసగా 14రోజులపాటు 5శాతం కన్నా తక్కువగా ఉంటే ఆంక్షలు సడలించడం, తిరిగి అన్ని కార్యకలాపాలను తెరచుకోవచ్చని సూచిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాటికి భారత్‌ ఈ కీలక మైలురాయిని దాటింది. అయితే, సెకండ్‌ వేవ్‌ కథ ముగిసినట్లు ప్రకటించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆంక్షల సడలింపునకు ఓకేనా..?

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 53వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 88రోజుల్లో ఇవే కనిష్ఠ కేసులు కాగా పాజిటివిటీ రేటు 3.83శాతానికి తగ్గింది. ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుత సంక్షోభ పరిస్థితి ముగిసినట్లేనని.. కొవిడ్‌ ఆంక్షల సడలింపునకు మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది. అయితే, కరోనా కొత్తరకాలు వెలుగు చూడడం, కొన్ని జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ రేటు 5శాతానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రకటనపై తొందరపడొద్దు..!

కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా దిగుమకు చేరుకోవడం ఊరట కలిగించేదే అయినప్పటికీ డెల్టా ప్లస్‌ వంటి కొత్తరకాలు పుట్టుకురావడం కొంత ఆందోళన కలిగించే అంశమని దిల్లీలోని శివనాడార్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నాగసురేష్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో మొదటి వేవ్‌ ప్రభావం ముగిసినట్లు ప్రకటించగా.. కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌తో మార్చి నాటికి సెకండ్‌ వేవ్‌ విజృంభణ మొదలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ క్రియాశీల కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని దిల్లీకి చెందిన ప్రజారోగ్య నిపుణులు చంద్రకాంత్‌ లహారియా పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం దిగువకు వచ్చినప్పటికీ చాలా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. సెకండ్‌ వేవ్‌ ప్రభావం ముగిసిందని ప్రకటించేముందు.. అన్ని జిల్లాల్లో ఈ పాజిటివిటీ రేటు 5శాతం తక్కువగా ఉన్నప్పుడే అలా చేయాలని సూచించారు. కరోనా కట్టడిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న కేరళలో పాజిటివిటీ రేటు 10శాతం ఉండడాన్ని గుర్తుంచుకోవాలని మరో శాస్త్రవేత్త గౌతమ్‌ మీనన్‌ స్పష్టంచేశారు. అయితే, ఇలా కొన్ని ప్రాంతాల్లో తప్పితే దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత తగ్గినమాట వాస్తమేనన్నారు.

కరోనా విజృంభణ వేళ కొవిడ్‌ మరణాలను నమోదు చేయడం కూడా ముఖ్యమైన విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య కంటే వాస్తవ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు నివేదికలు వచ్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ ముప్పు ముగిసిందా? లేదా? అని ప్రకటించడం ముఖ్యం కాదని.. రానున్న రోజుల్లో సంభవించే మరో విజృంభణను ఎదుర్కొనేందుకు ఏమేరకు సిద్ధంగా ఉన్నామనేదే ప్రధానమని చంద్రకాంత్‌ లహారియా స్పష్టం చేశారు. ఏదేమైనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో భాగంగా వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం, వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాలు సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని