4th Wave: భారత్‌లో కొత్త వేవ్‌ వస్తుందా..? ప్రభావం ఎలా ఉండనుంది?

భారీస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తికావడం, ఇప్పటికే చాలామంది వైరస్‌కు గురికావడం వల్ల రోగనిరోధకత పెరగడం వంటి అంశాల కారణంగా భారత్‌పై కొత్త వేవ్‌ తీవ్రప్రభావం చూపెట్టక పోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Published : 21 Mar 2022 01:35 IST

కొత్త వేరియంట్లపై నిపుణులు ఏమంటున్నారంటే

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ పూర్తిగా ముప్పు మాత్రం ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో యూరప్‌తోపాటు దక్షిణాసియాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో ఒకవేళ కొత్త వేవ్‌ రూపంలో వైరస్‌ మళ్లీ విరుచుకుపడితే ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మనదేశంలో భారీస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తికావడం, ఇప్పటికే చాలామంది వైరస్‌కు గురికావడం వల్ల రోగనిరోధకత పెరగడం వంటి అంశాల కారణంగా భారత్‌పై కొత్త వేవ్‌ తీవ్రప్రభావం చూపెట్టక పోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్కును తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను కూడా సడలించవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

1000 మ్యుటేషన్లు.. అయినప్పటికీ..

దేశంలో కొవిడ్‌ విస్తృతి తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో వైరస్‌లో మ్యుటేషన్లు సంభవిస్తాయని కొవాగ్జిన్‌ ప్రయోగాల నిర్వహణలో కీలకపాత్ర వహించిన డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు 1000 మ్యుటేషన్లు జరిగినప్పటికీ వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆందోళనకరమైనవని గుర్తుచేశారు. ఇక సహజంగా ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్ల పొందిన రక్షణ ఉత్తమమైనది కావడంతోపాటు ఎక్కువ కాలం రక్షణ ఇస్తుందన్నారు. వీటికితోడు భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ అందించడం వల్ల భవిష్యత్తులో వచ్చే వేవ్‌ల ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని ఎయిమ్స్‌ వైద్య నిపుణులైన డాక్టర్‌ రాయ్‌ స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో మాస్క్‌ తప్పనిసరి నిబంధననను సడలించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చన్న ఆయన.. వృద్ధులు, ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రం మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటితోపాటు భవిష్యత్తులో కొత్త వేరియంట్‌లను పసిగట్టేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు.

హైబ్రిడ్‌ ఇమ్యూనిటీతో..

దేశంలో కొత్త వేరియంట్‌ వచ్చినా ప్రభావం మాత్రం తక్కువగానే ఉండనున్నట్లు ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రకాంత్‌ లహారియా పేర్కొన్నారు. ‘సీరోసర్వేలు, వ్యాక్సినేషన్‌ కవరేజ్‌, ఒమిక్రాన్‌ వ్యాప్తి ఫలితాలను విశ్లేషిస్తే.. దేశంలో ప్రస్తుతానికి కొవిడ్‌ మహమ్మారి ముప్పు ముగిసినట్లే. మరికొన్ని నెలల్లో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చినా ప్రభావం మాత్రం తక్కువే. ఎందుకంటే, మూడు వేవ్‌ల తర్వాత హైబ్రిడ్‌ (వైరస్‌కు గురికావడం, వ్యాక్సిన్‌, వైరస్‌ సోకాల్సిన వారిసంఖ్య తక్కువగా ఉండడం వల్ల) ఇమ్యూనిటీ సాధించారు. యాంటీబాడీ స్థాయిలు తగ్గినప్పటికీ హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ రక్షణ కల్పిస్తుంది. ఇటువంటి సమయంలో కేసుల కన్నా అవి కలిగించే ప్రభావాలే వైరస్‌ తీవ్రతను అంచనా వేసేందుకు అతి ముఖ్యమైన అంశాలు’ అని డాక్టర్‌ లహారియా వెల్లడించారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైరస్‌ తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగించాలన్న ఆయన.. ఇది కొవిడ్‌తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉండే సమయమన్నారు. ఇదే సమయంలో మెజారిటీ ప్రజలకు మాస్క్‌ తప్పనిసరిగా అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ.. నిర్లక్ష్యం వద్దు

దేశంలో ఇప్పటికే 80 నుంచి 90శాతం ప్రజలు వైరస్‌ బారినపడ్డారని.. కొత్తవేవ్‌ వచ్చినప్పటికీ తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రికి చెందిన ప్రజారోగ్య వైద్య నిపుణులు డాక్టర్‌ గుజాల్‌ కిశోర్‌ వెల్లడించారు. విస్తృత వ్యాక్సినేషన్‌ వల్ల దేశంలో తీవ్ర ప్రభావం చూపే కొత్త వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువనే కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా ఇటీవల పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వేరియంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నందున నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో విజృంభణకు ఒమిక్రాన్‌తోపాటు దాని ఉపరకాలే కారణమని చెప్పిన ఆయన.. విదేశాల్లో నమోదవుతున్న కొవిడ్‌ మరణాల్లో ఎక్కువ భాగం వ్యాక్సిన్‌ తీసుకోని వారిలోనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో మూడో డోసు తీసుకోవాల్సిన వారితోపాటు 12 నుంచి 18ఏళ్ల పిల్లలూ వ్యాక్సిన్‌ తప్పక తీసుకోవాలని డాక్టర్‌ అరోఢా సూచించారు.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో పర్యవేక్షణ

దేశంలో కొత్త వేరియంట్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇన్సాకాగ్‌కు నమూనాలను ఎప్పటికప్పుడు పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది. వైరస్‌ విస్తృతిపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే, భారత్‌లో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఆదివారం కేవలం 1761 కేసులు నమోదుకాగా 127 మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 688 రోజుల్లో ఈ స్థాయిలో తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని