Presidential Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శరద్‌ పవార్‌?

వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పోటీ చేయబోతున్నారా? ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే బరిలో నిలవబోతున్నారా?.....

Published : 13 Jun 2022 16:11 IST

దిల్లీ: వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పోటీ చేయబోతున్నారా? ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే బరిలో నిలవబోతున్నారా? తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అదే నిజమనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తులు ముమ్మరం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేలా భాజపా కసరత్తు చేస్తుండగా.. మోదీ సర్కార్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు జోరుగా పావులు కదుపుతున్నాయి. అయితే, ఇప్పటివరకు విపక్షాలు నిర్వహిస్తున్న సమావేశాలను బట్టి తమ ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌ పవార్‌వైపే మొగ్గుచూపుతున్నట్టు కనబడుతోంది. 

రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి ఎవరనే అంశం చర్చకు వస్తున్న ప్రతిసారీ ప్రధానంగా పవార్‌ పేరే వినబడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు తమ అభ్యర్థిగా శరద్‌ పవారే ఉండాలని పలు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే గురువారం శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన సందేశంతో ముంబయి వెళ్లి పవార్‌ను కలిసి చర్చలు జరిపారు. అయితే, పవార్‌ స్పందించలేదని సమాచారం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లతోనూ ఖర్గే చర్చలు జరిపారు. అంతేకాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన ఫోన్‌లో సంప్రదించారు. ఇంకోవైపు, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ కూడా ఆదివారం శరద్‌ పవార్‌ను కలిసి చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికలపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికపై ఈ నెల 15న దిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలపై ప్రతిపక్షాలు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. 

శరద్‌ పవార్‌ దేశంలోనే ఎంతో సీనియర్‌ రాజకీయ దిగ్గజం. అనేక పార్టీల మధ్య పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాలను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన అపార అనుభవం ఉంది. మహారాష్ట్రలో సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను భాజపాకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

ఇంకోవైపు, రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను రంగంలోకి దించింది. అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయ సాధన దిశగా చర్చలు జరపాలని సూచించింది. 2017లో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఏకాభిప్రాయం కోసం భాజపా రాజ్‌నాథ్‌ సింగ్‌, వెంకయ్యనాయుడును నియమించింది. అయితే, ఆ తర్వాత వెంకయ్యనాయుడునే ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలతో చర్చల్లో ఒకవేళ ఏకాభిప్రాయం కుదరనట్లయితే.. భాజపా రాష్ట్రపతి ఎన్నికకు సిద్ధం కానున్నట్టు సమాచారం. అధికార పార్టీ నుంచి అనేకమంది పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. వీటిపై భాజపా అధికారికంగా ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని