Nipah: కేరళలో నిపా వైరస్‌.. ఆ పండే కారణమా..?

కరోనా ఉద్ధృతితో సతమతమవుతోన్న కేరళలో ఇప్పుడు నిపా వైరస్‌ కలకలం రేపుతోంది. నిపా బారినపడి 12ఏళ్ల బాలుడు మృతిచెందాడు. అయితే రంబుటన్‌(Rambutan)

Published : 06 Sep 2021 13:42 IST

కోజికోడ్‌: కరోనా ఉద్ధృతితో సతమతమవుతోన్న కేరళలో ఇప్పుడు నిపా వైరస్‌ కలకలం రేపుతోంది. నిపా బారినపడి 12ఏళ్ల బాలుడు మృతిచెందాడు. అయితే రంబుటన్‌(Rambutan) అనే పండు నుంచి ఈ వైరస్‌ బాలుడికి సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పండును పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్‌ఐవీ)కి పంపించారు.

కోజికోడ్‌లోని మావోర్‌ ప్రాంతానికి చెందిన ఆ బాలుడికి ఆగస్టు 27న జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం బాలుడు కన్నుమూశాడు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పుణెకు పంపగా.. నిపా వైరస్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టింది. బాలుడి ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

అటు రాష్ట్రానికి సహకారం అందించేందుకు కేంద్రం నుంచి వచ్చిన ఎన్‌సీడీసీ బృందం మృతుడి ఇంటికి వెళ్లి పరిశీలించింది. ఆ బాలుడు ఇటీవల తమ ఇంటి సమీపంలో ఉన్న రంబుటన్‌ పండ్లను తిన్నాడని, ఆ తర్వాతే అనారోగ్యానికి గురయ్యాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆ పండ్ల నమూనాలను పుణెకు పంపారు. రంబుటన్‌ పండు నుంచే ఈ వైరస్‌ బాలుడిని సోకి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలుడు తిన్న ఈ పండును గబ్బిలాలు కొరికి ఉండొచ్చని, తద్వారా వైరస్‌ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. 

మరోవైపు బాలుడితో సన్నిహితంగా మెలిగిన 188 మందిలో 20 మందికి అత్యంత ముప్పు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో నిపా లక్షణాలున్న 8 మంది రక్త నమూనాలను కూడా వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే కంగారుపడాల్సిన అవసరం లేదని, వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. దక్షిణాసియాలో ఎక్కువగా దొరికే ఈ రంబుటన్‌ పండ్లను గత రెండు దశాబ్దాలుగా కేరళలో సాగు చేస్తున్నారు.

2018లో తొలిసారిగా కేరళలో నిపా వైరస్‌ కలకలం రేపింది. గబ్బిలాలు కొరికిన మామిడి పండ్లను తినడం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అప్పట్లో అధికారులు నిర్ధారించారు. నిపా కారణంగా ఆ ఏడాది 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ సోకిన వారికి మెదడు వాపు; జ్వరంతో పాటు దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టమవడం; తీవ్ర లేదా స్వల్ప శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ వంటి లక్షణాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని